700 రోజులుగా చిత్ర హింసలకు గురిచేసినా..వెన్ను చూపని ధీరులు

Jan 24,2024 10:25 #Communists, #Ukraine
Ukraine Communist Kononovich brothers appeal for help

 ఆ ఇద్దరు కమ్యూనిస్టు సోదరులు

కీవ్‌: ఉక్రెయిన్‌లో అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్న జెలెన్‌స్కీ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినా, కమ్యూనిస్టులను వెంటాడి వేధిస్తున్నా , భద్రతాదళాలు కిడ్నాపు చేసి జైల్లో చిత్ర హింసలకు గురి చేస్తున్నా వారు అదర లేదు, బెదరలేదు. ప్రభుత్వ విధానాలపై బిగించిన పిడికిళ్లు కొంచెం కూడా సడలలేదు. 700 రోజులుగా భద్రతా దళాల చేతిలో చిత్రహింసలకు గురవుతున్నా తొణుకు బెణుకు లేకుండా నిర్భయంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్న ఇ ఇద్దరు సోదరులు ఎవరో కాదు. వారే మిఖాయిల్‌, అలెగ్జాండర్‌. ఉక్రెయిన్‌ కమ్యూనిస్టు పార్టీ యువజన విభాగం నాయకులుగా ఉన్న వీరిని 2022 మార్చి6న ఉక్రెయిన్‌ భద్రతా దళాలు కిడ్నాపు చేసి జైలులో నిర్బంధించాయి. వారు చేసిన నేరం ఏమిటంటే నాటో ద్వారా యూరప్‌లో అమెరికన్‌ సామ్రాజ్యవాద సైనిక విస్తరణను ఆపాలంటూ కీవ్‌లోని అమెరికన్‌ ఎంబసీ ఎదుట ప్రదర్శన నిర్వహించడం. జెలెన్‌స్కీ ప్రభుత్వ ప్రైవేటీకరణ , ఇతర ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం. కమ్యూనిస్టు సోదరుల ధిక్కార ధోరణిని చూసి జెలెన్‌స్కీ ప్రభుత్వం బెంబేలెత్తింది. ఇందుకు గాను వీరిని జీవితాంతం జైలులో ఉండేలా చేసేందుకు రకరకాల సెక్షన్ల కింద తప్పుడు కేసులు బనాయించింది. వీరి తరపు న్యాయవాదిని కూడా ఉక్రెయిన్‌ అధికారులే నియమించారు. తిమ్మిని బమ్మిని చేసి ఈ కేసుల్లో దోషులుగా వారిని నిర్ధారిస్తే, పదేళ్లు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. 2014-2015 మధ్య తూర్పు ఉక్రెయిన్‌లోని డానెట్‌స్క్‌, లుగానెస్క్‌ ప్రాంతాల్లో తలెత్తిన అంతర్యుద్ధాన్ని ఫెడరల్‌ చట్ర పరిధిలో పరిష్కరించుకోవాలని, వాటికి స్వయం ప్రతిపత్తి (అటానమీ) కల్పించాలని కోరినందుకు ఉక్రెయిన్‌ కమ్యూనిస్టు పార్టీపై జెలెన్‌స్కీ ప్రభుత్వం నిషేధం విధించి ఏ ఎన్నికల్లోనూ పాల్గొనకుండా చేసింది. 2014లో కుదిరిన మిన్‌స్క్‌ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు జెలెన్‌స్కీ ప్రభుత్వం తిరస్కరించింది. దీనిని ప్రశ్నించిన కమ్యూనిస్టులపై అమెరికా అండతో తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతోంది.

➡️