చిలీలో ఆగని కార్చిచ్చు – 51 మంది మృతి..!

Feb 4,2024 10:28 #46, #chile, #fire, #people died, #Unstoppable

చిలీ : దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 51మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది కంటే తక్కువ విస్తీర్ణంలో కార్చిచ్చు చెలరేగినా.. ప్రాణ నష్టం మాత్రం అధికంగా ఉంది. వేసవి వచ్చిందంటే చాలు.. అమెరికా, ఐరోపా ఖండాల్లోని అడవుల్లో కార్చిచ్చు చెలరేగి లక్షలాది ఎకరాలు కాలిబూడిదవుతున్నాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.

పరిస్థితులు దయనీయంగా మారుస్తున్నాయి : అధ్యక్షుడు బోరిక్‌

అధ్యక్షుడు బోరిక్‌ గాబ్రియెల్‌ శనివారం మాట్లాడుతూ … ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు 51 మంది మృతిచెందినట్లు తెలిపారు. వేలాది మంది గాయపడినట్లు చెప్పారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు వివరించారు. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్‌ విజ్ఞప్తి చేశారు. మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.

గత దశాబ్ద కాలంలో ఈ కార్చిచ్చు అత్యంత దారుణం : చిలీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌

                   ప్రస్తుతం చిలీ వ్యాప్తంగా 92 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగగా.. 43 వేల హెక్టార్లలో అడవులు ప్రభావితమైనట్టు మంత్రి కరోలినా చెప్పారు. ఇక, తీరప్రాంత పర్యాటక నగరం వినాడెల్‌ మార్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, కార్చిచ్చు ప్రాంతాలకు చేరుకోవడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ఇక, చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్ధమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాదితో పోల్చితే ఇది తక్కువ విస్తీర్ణమైనా.. ప్రాణనష్టం అధికంగా ఉంది.

➡️