పేటిఎం ఉద్యోగులు వెయ్యిమందిపై వేటు

Dec 26,2023 09:29 #Employees, #more than, #paytm, #thousand

ముంబయి : ప్రముఖ పిన్‌టెక్‌ కంపెనీ పేటిఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఉద్యోగులను భారీగా ఇంటికి పంపించింది. పేటిఎంలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 10-15 శాతం మందిపై ప్రభావితం చూపనుందని సమాచారం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా సిబ్బందిని ఇంటికి పంపించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పేటిఎం తన వ్యాపారాలను పునర్‌ వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో కోతలు విధించినట్లు ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల రిటైల్‌ రుణాల జారీని తగ్గించుకోవడం, యుపిఐ ప్లాట్‌ఫామ్‌పై ‘ఇప్పుడు కొనండి… తర్వాత చెల్లించండి’ రుణాలను నిలిపివేయడం వంటి చర్యల తర్వాత సిబ్బంది తొలగింపు నిర్ణయం వెలుపడింది. గతేడాది వ్యవధిలో భారీ వృద్ధి నమోదు చేసిన రుణ విభాగం నుంచే అత్యధిక తొలగింపులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో వివిధ నూతన టెక్‌ కంపెనీలు దాదాపు 28 వేల మంది ఉద్యోగులను తొలగించాయని లాంగౌజ్‌ కన్సల్టెంగ్‌ పరిశోధన సంస్థ అంచనా వేసింది.

➡️