పొంతన కోసం పడిగాపులు – ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్‌

– బిజెపి పెద్దలతో భేటీ రేపటికి వాయిదా

-సీట్ల పంపకాలపై కసరత్తు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:బిజెపితో పొంతన కోసం టిడిపి, జనసేన న్యూఢిల్లీలోనే పడిగాపులు పడుతున్నాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసం గురువారం ఢిల్లీ వెళ్లిన ఇరువురు పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ బిజెపి పెద్దలతో సమావేశం కోసం శుక్రవారం రోజంతా నిరీక్షించారు. కేంద్ర హోం మంత్రి, బిజెపి కీలక అగ్రనేత అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాతో రెండో దఫా చర్చల కోసం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలవాల్సి ఉంది. అయితే అమిత్‌ షా పార్టీ అంతర్గత చర్చల్లో ఉండటంతో అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో టిడిపి నేత గల్లా జయదేవ్‌ నివాసం (అశోక రోడ్డు 50)లో చంద్రబాబు, హౌటల్‌ తాజ్‌ మాన్‌ సింగ్‌లో బస చేసిన పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం ఉదయం నుంచి బిజెపి నేతల కబురు కోసం వేచిచూస్తూ కాలం గడిపారు. చివరికి కమలం అధినేతల నుంచి కబురు రాకపోవడంతో భేటీ (శనివారం)కి వాయిదా పడినట్లు తెలిపారు. అమిత్‌ షా శనివారం ఉదయం పాట్నాకు వెళాల్సివుంది. అదే రోజు పాట్నా బయల్దేరేలోగా ఉదయం 10-11 గంటల మధ్యలో చంద్రబాబు, పవన్‌తో ఆయన భేటీ అవుతారని సమాచారం. ప్రధానంగా సీట్ల సంఖ్యపై మరింత స్పష్టత కోసమే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బిజెపి, జనసేనకు 8 లోక్‌సభ, 30 నుంచి 35 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే 8 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలు తమకు కావాలని బిజెపి డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కూడా చంద్రబాబు ఓకే చెప్పే వీలుందని చర్చ జరుగుతోంది.

➡️