రైతులకు బిజెపి ద్రోహం

Jan 25,2024 08:14 #BJP, #BJP Govt, #farmers
  • లక్ష కోట్లు నిధులు వెనక్కి పంపిన కేంద్ర వ్యవసాయ శాఖ : ఎస్‌కెఎం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రూ. లక్ష కోట్ల నిధులను వెనక్కి (సరెండర్‌) పంపినందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖపై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ధ్వజమెత్తింది. బిజెపిని ‘శిక్షించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధులను సరెండర్‌ చేయడంతో రైతులకు ద్రోహం చేసిందని విమర్శించింది. ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2014-2022లో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. ఈ మేరకు ఎస్‌కెఎం బుధవారం ప్రకటన విడుదల చేసింది.

2022-23 సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌ అనే శీర్షికతో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 2018-19 నుండి గత ఐదేళ్లలో రూ.1,05,543.71 కోట్లు సరెండర్‌ చేసిందని ప్రకటన తెలిపింది. 2018-19లో వ్యవసాయ మంత్రిత్వ శాఖకు మొత్తం కేటాయింపులు రూ.54 వేల కోట్లు. ఆ ఏడాది రూ.21,043.75 కోట్లు సరెండర్‌ చేసింది. తరువాతి సంవత్సరాల్లో 2019-20లో రూ.34,517.7 కోట్లు, 2020-21లో రూ.23,824.53 కోట్లు, 2021-22లో రూ.5,152.6 కోట్లు, 2022-23లో రూ.21,005.13 కోట్లు సరెండర్‌ చేసింది. వ్యవసాయం, పశుసంవర్ధక, ఆహార ప్రాసెసింగ్‌పై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కూడా నిధుల సరెండర్‌ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలు, షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక, షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళికపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సూచించిందని తెలిపింది.అలాగే, ”2014 లోక్‌సభ ఎన్నికల్లో రైతులకు రుణభారం నుంచి విముక్తి కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చింది. మోడీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థల బకాయిలను రూ.14.56 లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ రైతు రుణంలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు” అని పేర్కొంది.

మోడీ పాలనలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్య

”నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం నరేంద్ర మోడీ పాలన (2014-2022)లో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మోడీ ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పిన సొమ్మును రైతుల కోసం వినియోగించి ఉంటే చాలా మంది ప్రాణాలు కాపాడి ఉండేవారు” అని ప్రకటన పేర్కొంది. ”దేశ రైతుల ప్రయోజనాలకు ద్రోహం చేసే నిధులను వెనక్కి ఇచ్చే ఇలాంటి నేరపూరిత చర్యను ఎస్‌కెఎం తీవ్రంగా ఖండిస్తుంది. వ్యవసాయాన్ని కార్పొరేట్‌లకు అప్పగించడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం” అని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎస్‌కెఎం తీవ్రంగా నిరసిస్తూ, కార్పొరేట్‌ దోపిడీని అంతం చేయడానికి, వ్యవసాయాన్ని రక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రైతులు, ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి బిజెపిని శిక్షించాలని ఎస్‌కెఎం రైతులకు పిలుపునిచ్చింది.

➡️