సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోరెన్‌

Feb 1,2024 12:11 #Hemant Soren, #Supreme Court

  రాంచీ :    భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఝార్కండ్‌ మాజీ సిఎం హేమంత్‌ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాలు చేస్తూ గురువారం ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట హేమంత్‌ సోరెన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, ఎ.ఎం. సింఘ్వీలు వాదనలు వినిపించారు. సిట్టింగ్‌ ముఖ్యమంత్రుల అరెస్టులు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని అన్నారు. సోరెన్‌ అరెస్టుతో ఈడి అధికారాల దుర్వినియోగాన్ని అధికార పిఎంఎల్‌ఎ సెక్షన్‌ 19 (అరెస్ట్‌ విధానం) వాస్తవ ఉద్దేశంపై నెలకొన్న అస్పష్టతను మరోసారి హైలెట్‌ చేసిందని సిబల్‌ కోర్టుకు తెలిపారు. వాస్తవానికి సెక్షన్‌ 19 దర్యాప్తు సంస్థ అరెస్టుకు గల కారణాల గురించి నిందితులకు సమాచారం అందించాలని మాత్రమే చెప్పిందని అన్నారు. సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఈడి నిందితుడికి సహేతుకమైన వ్యవధి అంటే అరెస్టు చేసిన 24 గంటలలోపు మాత్రమె అతని అరెస్టుకు సంబంధించిన వ్రాతపూర్వక కాపీని అందించాలని పేర్కొంది.

హేమంత్‌ సోరెన్‌ ఇప్పటికే ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 1న విచారణ జరగాల్సి వుందని అన్నారు.ఫిబ్రవరి 2న తగిన ధర్మానం ఎదుట కేసును జాబితా చేసే అంశాన్ని పరిశీలించేందుకు చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ అంగీకరించారు.

భద్రత కట్టుదిట్టం.. రాంచీలో ఆంక్షలు

హేమంత్‌ సొరెన్‌ను ఈడీ విచారిస్తున్న సమయంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని పలు కీలక ప్రాంతాల్లో అధికారులు నిషేదాజ్ఞలు విధించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించటానికి ముగ్గురు సభ్యుల బఅందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.

➡️