మణిపూర్‌ హింసాకాండపై 11,000 అఫిడవిట్లు

న్యూఢిల్లీ :    మణిపూర్‌ హింసాకాండపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి (సిఒఐ) 11,000 అఫిడవిట్లు వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. ఈ అఫిడవిట్లలో అధిక శాతం హింసాకాండలో ప్రభావితమైన బాధితుల నుండి వచ్చాయని అన్నారు. మరికొన్నింటిని కొండ, లోయ ప్రాంతాల్లోని పౌర సమాజ బృందాలు దాఖలు చేశాయని చెప్పారు. ఇప్పటి వరకు అందిన అన్ని అఫిడవిట్‌లను సిఒఐ పరిశీలించిందని, హింస ఇతర సంబంధిత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు మణిపూర్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలో స్పందన కోరనుందని ఆ అధికారి తెలిపారు. నివేదికను ఖరారు చేసే ముందు ప్రైవేట్‌ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులతో సహా సాక్షులను కూడా విచారించాలని సిఒఐ భావిస్తోందని అన్నారు.

”స్టేట్‌మెంట్‌, ఆరోపణలు, ఫిర్యాదులు” అఫిడవిట్ల రూపంలో సమర్పించాల్సిందిగా ఈ కమిటీ గతేడాది నవంబర్‌లో ప్రజలకు సూచించింది. అఫిడవిట్లను నమోదు చేసేందుకు ప్రోత్సహించేలా సహాయక శిబిరాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు ఈ కమిషన్‌ నియమించింది. నోటరీలు, చట్టపరమైన అధికారులను నియమించిందని, ప్రజలు తమ ఫిర్యాదులను హెల్ప్‌డెస్క్‌ సిబ్బంది టైప్‌ చేస్తారని అన్నారు. ప్రజల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయరని అన్నారు.
గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజరు లంబా నేతృత్వంలో మాజీ ఐఎఎస్‌ అధికారి హిమాన్షు శేఖర్‌ దాస్‌, మాజీ ఐపిఎస్‌ అధికారి అలోక్‌ ప్రభాకర్‌లను దర్యాప్తు కమిటీగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతేడాది జూన్‌లో నియమించిన సంగతి తెలిసిందే.

➡️