15 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

Dec 14,2023 22:35 #New Delhi, #Parliament Session

సభలో లేని డిఎంకె ఎంపి పార్థిబన్‌పైనా..ఆ తరువాత ఉపసంహరణ

భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం

తిరస్కరించిన ప్రభుత్వం

ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు

పలు మార్లు వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం గురువారం ఉభయ సభలను కుదిపేసింది. బిజెపి ఎంపీ ఇచ్చిన పాస్‌ సాయంతో పార్లమెంటులోకి ఇద్దరు యువకులు ప్రవేశించి పొగబాంబులు పేల్చిన ఘటనపై చర్చ జరగాలని పట్టుబట్టినందుకు 15 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సభలో లేని డిఎంకె ఎంపీ పార్థిబన్‌పైనా సస్పెన్షన్‌ విధించి, ఆ తరువాత పొరపాటైందంటూ ఆయనపై వేటును ఎత్తేశారు. లోక్‌సభలో 14 మంది, రాజ్యసభలో ఒకరిని ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన కాలానికి సస్పెండ్‌ చేశారు. గురువారం ఉదయం పార్లమెంటు సమావేశం కాగానే బుధవారం నాటి భద్రతా ఉల్లంఘన ఘటనలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఇందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకసారి వాయిదా వేశారు. అంతకుముందు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. ” బుధవారం నాటి ఘటనను అందరూ ఖండిస్తున్నారు. దీనిపై స్పీకర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. పాస్‌లు ఇచ్చే విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు. దీనిపై ఏమాత్రం సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు హౌం మంత్రి సభకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన ముఖం చాటేయడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు భద్రతా వైఫల్యానికి బాధ్యులైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వాన్ని నిలదీయడమే నేరమైనట్లుగా పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపిలను సస్పెండ్‌ చేస్తూ ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా సస్పెన్సన్‌ వేటు పడినవారిలో టిఎన్‌ ప్రతాపన్‌, హిబీ ఈడెన్‌, ఎస్‌ జ్యోతిమణి, రమ్య హరిదాస్‌, డిన్‌ కురియకోస్‌ ఉన్నారు. సభా నియమాలను ఉల్లంఘించినందుకు, సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను మధ్యాహ్నం 3 గంటలవరకు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో తొమ్మిది మంది ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్‌ చేశారు. వీరిలో కాంగ్రెస్‌ ఎంపిలు బెన్నీ బెహనన్‌, వికె శ్రీకందన్‌, మహ్మద్‌ జావేద్‌, మాణికం ఠాగూర్‌, సిపిఎం ఎంపిలు పిఆర్‌ నటరాజన్‌, ఎస్‌. వెంకటేశన్‌, డిఎంకె ఎంపిలు కనిమొళి కరుణానిధి, ఎస్‌ఆర్‌ పార్థిబన్‌, సిపిఐ ఎంపి కె. సుబ్బరాయన్‌ ఉన్నారు. ఆ తరువాత శుక్రవారానికి సభ వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. భద్రతా వైఫల్యంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు తొలుత వాయిదా వేశారు. భద్రతా ఉల్లంఘనలపై చర్చకు పట్టుబడుతూ టిఎంసి పక్షనేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ సభా మధ్య భాగంలోకి దూసుకెళ్లారు. దానిపై రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే డెరెక్‌ను ఈ సెషన్‌ మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. రూల్‌ 256 (2) ప్రకారం కౌన్సిల్‌ సర్వీస్‌ నుంచి సస్పెండ్‌ చేయబడిన డెరెక్‌ ఓబ్రెయిన్‌ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించాలని, ఆయన ”క్రమశిక్షణా రాహిత్యాన్ని” హౌస్‌ ప్రివిలేజెస్‌ కమిటీకి సూచించాలని, మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత పీయూష్‌ గోయల్‌ తీర్మానం తెచ్చారు. ఆ తరువాత సభను మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఒకసారి, 3 గంటలకు ఒక సారి, సాయంత్రం 4 గంటలకు ఒక సారి వాయిదా పడింది. అయినా ఫలితం లేకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారంటూ సస్పెండ్‌ చేసిన 14 మందిలో డిఎంకె ఎంపి ఎస్‌ఆర్‌ పార్థిబన్‌ అసలు సభకు హాజరుకానే లేదు. దీంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు ఎలా వేస్తారని ప్రతిపక్షాలు నిలదీయడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పొరపాటున పార్థిబన్‌ పేరు ఆ జాబితాలో చేర్చామంటూ తరువాత ఆయన పేరును సస్పెండయిన ఎంపీల జాబితా నుంచి తొలగించింది. పార్థిబన్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ స్రస్పెండయిన ఎంపీల జాబితాలో తన పేరు చేర్చడం పెద్ద ”జోక్‌” అని అన్నారు. తాను అనారోగ్యంతో ఉన్నందున పార్లమెంటుకు వెళ్లలేదని, అయినా తనపై వేటు వేయడం ఆశ్చర్యం కలిగించిందని డిఎంకె ఎంపీ పేర్కొన్నారు.’ప్రజాస్వామ్యం ఖూనీ’: సీతారాం ఏచూరి ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ను ”ప్రజాస్వామ్యం ఖూనీ”గా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఆయన ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. పార్లమెంటు భద్రతా వ్యవహారాల సభా సంఘాన్ని ఇంతవరకు పునర్వ్యవస్థీకరించలేదు. జాయింట్‌ సెక్రటరీ, సెక్యూరిటీ విభాగాల అధిపతులను నియమించలేదు. చొరబాటుకు స్పాన్సర్‌ చేసిన బిజెపి ఎంపీని ప్రశ్నించలేదు. కానీ ప్రధాని, కేంద్ర హోం మంత్రి జవాబుదారీతనం కోసం డిమాండ్‌ చేసినందుకు 15 మంది ప్రతిపక్ష ఎంపిలపై సస్పెన్షన్‌ వేటు వేశారు.ఇది . ప్రజాస్వామ్యాన్ని ఖూడీ చేయడం కాదా అని ఆయన నిలదీశారు. అప్రజాస్వామిక చర్య: కాంగ్రెస్‌ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌ను రబ్బరు స్టాంప్‌గా కుదించేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ విమర్శించారు. బుధవారం నాటి ఘటనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసినందుకు ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్‌ చేయడం భయంకరమైన, అప్రజాస్వామిక చర్య అని అన్నారు. జవాబుదారీతనం కోసం పట్టుబట్టిన ఎంపిలను సస్పెండ్‌ చేస్తారు. దుండగుల ప్రవేశానికి సహకరించిన బిజెపి ఎంపిపై ఎలాంటి చర్యలు లేవని ఆయన విమర్శించారు.

➡️