రైల్వే అభివృద్ధికి రూ.9,138 కోట్లు

రైల్వే జోన్‌పై ఎపి సర్కారును ప్రశ్నించండి

  రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో   :  2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌లో ఎపిలో రైల్వే అభివృద్ధి కోసం రూ.9,128 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎపిలో వివిధ పెట్టుబడుల రూపంలో రూ.68,059 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సరాసరిగా ఉమ్మడి ఎపి (ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి) కేవలం రూ.886 కోట్లు కేటాయించిందని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంతో పోల్చితే కేటాయింపులు దాదాపు 10 రెట్లు పెరిగాయన్నారు. గురువారం నాడిక్కడ రైల్వే భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్‌లో ఎపికి కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్‌ హయాంలో ఏడాదికి 70 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ నిర్మాణం పూర్తయితే, ప్రస్తుతం 246 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ట్రాక్‌ నిర్మాణంలో 97 శాతం వృద్ధి నెలకొందని చెప్పారు. అమృత్‌ స్టేషన్స్‌ స్కీం కింద రాష్ట్రంలోని 72 రైల్వే స్టేషన్లను ఆధునీకరించినట్లు తెలిపారు. అలాగే 709 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాస్‌లను పూర్తి చేశామన్నారు. 88 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు నిర్మించామన్నారు. 109 వన్‌ స్టేషన్‌-వన్‌ ప్రొడెక్ట్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.స్థలం అప్పగించిన వెంటనే పనులువిశాఖపట్నంలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు 53 ఎకరాల భూమి కావాలని, స్థలం కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. స్థలం అప్పగించిన వెంటనే రైల్వేజోన్‌ పనులు ప్రారంభిస్తామన్నారు. డిపిఆర్‌ ఇప్పటికే పూర్తయిందని, నిధుల మంజూరు మిగిలి ఉందన్నారు. ఐదేళ్లు పూర్తి అయిందన్న వాదనలపై స్పందించిన మంత్రి, తమను ఎందుకు నిలదీస్తున్నారని, ఎపి ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే ఏ విధంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని అన్నారు.

➡️