భారత్‌ మానవ హక్కుల రికార్డుకు ఎదురు దెబ్బ !

ఎన్‌హెచ్‌ఆర్‌సికి గుర్తింపు వాయిదా
న్యూఢిల్లీ : భారతదేశ మానవ హక్కుల రికార్డుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన, జెనీవా కేంద్రంగా పనిచేసే గ్లోబల్‌ అలయన్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐ) ఈ ఏడాది జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)కు గుర్తింపు ఇవ్వడాన్ని వాయిదా వేసింది. ఇలా గుర్తింపును వాయిదా వేయడం వరుసగా ఇది రెండో ఏడాది. ఈ నిర్ణయంతో మానవ హక్కుల మండలిలో అలాగే కొన్ని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సంస్థల్లో భారత్‌ ఓటు వేసే హక్కు ప్రభావితమవుతుంది. మే 1వ తేదీన జరిగిన అక్రిడిటేషన్లపై సబ్‌ కమిటీ (ఎస్‌సిఎ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీ తాజా నివేదిక ఇంకా రావాల్సి వుంది. గుర్తింపును వాయిదా వేయాలంటూ సిఫార్సు చేయడానికి పలు కారణాలను గతంలో ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యుల నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, మానవ హక్కుల దర్యాప్తుల పర్యవేక్షకు పోలీసు అధికారులను నియమించారని, కమిటీలో మహిళలు, మైనారిటీల ప్రాతినిధ్యం కొరవడిందని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఈ నిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి.

➡️