Protest: నీటి సమస్యపై ఆప్ మంత్రి అతిషి నిరాహార దీక్ష

ఢిల్లీ: ఢిల్లీలో తీవ్ర నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జలవనరుల శాఖ మంత్రి అతిషి మర్లెనా నిరాహార దీక్ష ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని భోగల్‌లోని సమరపంథాల్‌ లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అతిషి మర్లెనా మాట్లాడుతూ  ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి పూర్తి నీటి వాటాను విడుదల చేయలేదన్నారు.  ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ పంపినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు.  ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. అందులో అతిషి ‘దీక్ష’ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన వేడిగాలులతో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని టీవీల్లో చూసి తాను చాలా బాధపడ్డానని ముఖ్యమంత్రి అన్నారు. “దాహంతో ఉన్నవారికి నీరు అందించడం మన సంస్కృతి. ఢిల్లీకి పొరుగు రాష్ట్రాల నుండి నీరు వస్తుంది. ఇంత తీవ్రమైన వేడిలో పొరుగు రాష్ట్రాల మద్దతు మేము ఆశించాము. కానీ, హర్యానా ఢిల్లీ నీటి వాటాను తగ్గించింద”ని అన్నారు.

➡️