జయరాజన్‌పై ఆరోపణలు అర్థరహితం : పినరయి విజయన్‌

Apr 28,2024 06:57 #cm, #kerala, #Pinarayi Vijayan
Urban Commission soon for development of cities in Kerala, says Chief Minister Pinarayi Vijayan

తిరువనంతపురం : ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఇ.పి.జయరాజన్‌పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. బిజెపి నేత ప్రకాష్‌ జావేద్‌కర్‌తో జయరాజన్‌ సమావేశంపై బిజెపి, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమైనవని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి తప్పుడు ఆరోపణలు రావడం సర్వ సాధారణమని, ప్రజలు దీన్ని అర్ధం చేసుకోగలరని అన్నారు. జయరాజన్‌ది అద్భుతమైన రాజకీయ జీవితమని, అది ప్రతి ఒక్క కమ్యూనిస్టుకు స్ఫూర్తిదాయకంగా వుంటుందన్నారు. సిపిఎం నేతలను అప్రతిష్టపాల్జేసే ఉద్దేశంతో బిజెపి నేత కె.సురేంద్రన్‌, కెపిసిసి అధ్యక్షుడు కె.సుధాకరన్‌లు ఒకేలా మాట్లాడుతున్నారన్నారు. జయరాజన్‌కు ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు వున్నాయని, ఇతరులతో సంబంధాలు కొనసాగించేటపుడు చాలా జాగ్రత్తగా వుండాలన్నారు. ఆయన ఆ జాగ్రత్త పాటించలేదని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. జావేద్‌కర్‌ను సమావేశమవడంలో ఎలాంటి తప్పు లేదని, ఒక ప్రజా కార్యక్రమంలో తాను కూడా ఆయనను కలిశానని విజయన్‌ చెప్పారు.
ఈ వివాదంపై జయరాజన్‌ స్పందిస్తూ, దీని వెనుక ఏదో కుట్ర వుందన్నారు. ‘ మా అబ్బాయి ఫ్లాట్‌ కారిడార్‌లో ఆయన నడుచుకుంటూ వెళళుతుంటే చాలా యాదృచ్ఛికంగా నేను ఆయనను కలిశాను. రాజకీయాల గురించి మేమెన్నడూ చర్చించుకోలేదు.” అని స్పష్టం చేశారు.

➡️