కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందిశ్రీ రాహుల్‌తో విభేదాలు లేవు

Feb 22,2024 10:37 #akhilesh yadav, #Rahul Gandhi
  •  సమాజ్‌వాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌

లక్నో : రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. పొత్తుపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అంతా బాగానే ఉన్నదని, బాగానే ముగుస్తుందని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీతో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. పొత్తుకు సంబంధించి అన్ని విషయాలూ త్వరలోనే స్పష్టమవుతాయని ఆయన చెప్పారు. సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరితేనే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యారు యాత్రలో అఖిలేష్‌ భాగస్వామి అవుతారంటూ సమాజ్‌వాదీ పార్టీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అమేథీలో సోమవారం జరిగిన రాహుల్‌ యాత్రకు అఖిలేష్‌ హాజరు కాలేదు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ ఏకపక్షంగా మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా ఇప్పటి వరకూ ఆ పార్టీ 31 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరిందని, దీని ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 17-19 స్థానాల్లో పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పోటీ పడే స్థానాల్లో వారణాసి, రాయబరేలి, అమేథి, బారాబంకి, ఝాన్సీ, ఘజియాబాద్‌ ఉన్నాయి. కాగా రెండు పార్టీలు త్వరలోనే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి పొత్తుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అఖిలేష్‌తో ప్రియాంక మాట్లాడారని, దీంతో రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన తొలగిపోయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొరాదాబాద్‌ సీటుపై తొలుత పట్టుబట్టిన కాంగ్రెస్‌ ఆ తర్వాత దానిని వదులుకొని సీతాపూర్‌ స్థానాన్ని కోరింది. వారణాసి స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా ఆ స్థానాన్ని తనకు వదిలేయాలని కాంగ్రెస్‌ కోరుతోంది.

➡️