ఏపీ డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల

May 4,2024 14:20 #press meet, #Tdp mp kanakamedala

ఢిల్లీ: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎస్‌, డీజీపీని బదిలీ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని సీఈసీని కోరుతున్నామన్నారు.
”ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అబ్జర్వర్లతో ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలి. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాలను గుర్తించి స్పెషల్‌ ఫోర్స్‌ ఇవ్వాలి. 14 నియోజకవర్గాలనే ఈసీ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. దురదృష్టమేంటంటే ఇందులో పులివెందుల లేదు. కుప్పంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న తీరు చూస్తున్నాం. హింసాత్మక ఘటనల ప్రాంతాలనూ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలి. అక్కడికి కేంద్ర బలగాలను తరలించి ఎన్నికలను నిర్వహించాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణంతా వెబ్‌కాస్టింగ్‌ చేయాలి. స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవచ్చని ప్రజలకు ఈసీ భరోసా కల్పించాలి. ఇప్పటివరకు జరిగిన నేరాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాలపై దాడుల్లో ఈసీ అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. జగన్‌ ఏది చెబితే అదే శాసనమంటూ అధికారులు వ్యవహరిస్తున్నారు” అని కనకడమేడల రవీంద్ర కుమార్‌ విమర్శించారు.

➡️