క్రిప్టో కరెన్సీ కేసులో రూ.443కోట్ల ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ కేసులోని మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధమున్న రూ.443కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జప్తు చేసింది. ఈ ఆస్తులన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలోను, బంగారం, నగదు రూపంలోనూ వున్నాయి. గుజరాత్‌ డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ చట్టం, ప్రైజ్‌చీట్‌ మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌ బ్యానింగ్‌ చట్టం, ఐపిసిలోని వివిధ నిబంధనల కింద గుజరాత్‌లోని సూరత్‌ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ప్రాతిపదికన ఇడి దర్యాప్తు చేపట్టింది. నిందితుడు దివ్యేష్‌ దార్జి ప్రభృతులపై ఈ కేసు నమోదైంది. 2016 నవంబరు నుండి 2018 జనవరి మధ్య కాలంలో సతీస్‌ కుంభాని అనే వ్యక్తి క్రిప్టో కరెన్సీ బిట్‌ కనెక్ట్‌ కాయిన్‌ ప్రమోటర్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రమోటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని ఇడి పేర్కొంది. బిట్‌కనెక్ట్‌ కాయిన్‌కు సంబంధించిన వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ఆకర్షించేవాడని తెలిపింది. వారికి పెద్ద మొత్తంలో లాభాలు ఇవ్వజూపేవారని పేర్కొంది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం, ఈ రకంగా సతీస్‌ కుంభానీ, ఆయన సహచరులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించి, పెట్టుబడిదారులను మోసగించారు. ఆ తర్వత సతీష్‌ కుంభాని సహచరుల్లో ఇద్దరిని కిడ్నాప్‌ చేయడం ద్వారా శైలేష్‌ భట్‌, అతడి అనుచరులు సతీష్‌ కుంభాని దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఇడి తెలిపింది.

➡️