అన్నదాతలపై డ్రోన్లతో దాడి 

Attack with drones on farmers in delhi
  • రెండో రోజూ కర్షకులపై కొనసాగిన కాఠిన్యం 
  • తీవ్రంగా ఖండించిన సిపిఎం 
  • ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తె మధుర ఆవేదన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టం, తదితర సమస్యల పరిష్కారం కోసం ‘చలో ఢిల్లీ’ చేపట్టిన రైతులపై కేంద్రంలోని మోడీ సర్కార్‌, హర్యానాలోని బిజెపి ప్రభుత్వం రెండో రోజూ తమ కాఠిన్యాన్ని చాటుకున్నాయి. పెద్ద సంఖ్యలో భద్రత బలగాలను, పోలీసులను రంగంలోకి దాడులు చేయించాయి. ఢిల్లీలోకి అడుగుపెట్టనీవ్వకుండా అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం ఉదయం కూడా లాఠీ ఛార్జీ చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా భాష్పవాయు గోళాలు ప్రయోగించి కర్కశాన్ని ప్రదర్శించారు. రైతులపై జరిగిన దాడిని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఇటీవల భారతరత్న ప్రకటించిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తె మధుర స్వామినాథన్‌ సైతం రైతులపై పోలీసుల దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు నేరస్తులు కారని, దేశానికి అన్న ప్రదాతలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. సిఐటియు, అఖిల భారత కిసాన్‌ సభ, సంయుక్త కిసాన్‌ మోర్చా సహా పలు కార్మిక, ప్రజా సంఘాలు కూడా అన్నదాతలపై అణిచివేత చర్యలను ఖండించాయి.

రాజధాని సరిహద్దుల్లో ఉద్రిక్తత

అన్నదాతల ‘చలో ఢిల్లీ’ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు అడుగుడుగునా భద్రతా ఏర్పాట్లు చేయడం, సెంట్రల్‌ ఢిల్లీతో హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ఆంక్షలు విధించడంతో రాజధాని సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పంజాబ్‌-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు బుధవారం కూడా భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. భారీ భద్రత, కాంక్రీట్‌ బారికేడ్లు ఉన్నప్పటికీ రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్‌ను కొనసాగించడంతో శంభు ప్రాంతం వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. డ్రోన్లతో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్‌ పెడుతున్నారు. గాలిపటాలు ఎగురవేసి డ్రోన్లను అడ్డుకుంటున్నారు. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. టియర్‌ గ్యాస్‌ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు  రైతులు తాగేందుకు తీసుకొచ్చుకున్న నీళ్ల బాటిళ్లతో దుస్తులు తడిగా ఉంచుకుంటున్నారు.

రైతన్నలపై ఇంతటి అణిచివేత ఎప్పుడూ లేదు : ఏచూరి

రైతులపై పోలీసు చర్యను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఈ నెల 16న జరగనున్న రైతుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. రైతులపై డ్రోన్లను వినియోగించి మరీ భాష్పవాయు గోళాలు ప్రయోగించి అణిచివేత చర్యలకు పాల్పడటం దుర్మార్గమని ఆయన అన్నారు. ఇంతటి తీవ్రస్థాయిలో రైతులపై అణిచివేత చర్యలు ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత అని, అణిచివేత చర్యలకు తక్షణమే ముగింపు పలకాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని శిరోమణి అకాలీదళ్‌ బుధవారం డిమాండ్‌ చేసింది. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించేందుకు డ్రోన్లను ఉపయోగించవద్దని పంజాబ్‌ ప్రభుత్వం హర్యానా పోలీసులను కోరింది.

రైతులను నేరస్థులు కారు : మధుర స్వామినాథన్‌

శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని, వారు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తె మధుర స్వామినాథన్‌ అన్నారు. రైతులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె ఖండించారు. తన తండ్రి ఎంఎస్‌కు మరణానంతరం భారతరత్న పురస్కార ప్రదానం సందర్భంగా ఢిల్లీలోని పూసాలో ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఆర్‌ఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. పంజాబ్‌ రైతులు పాదయాత్ర చేస్తున్నారని, అయితే వారి కోసం హర్యానాలో జైళ్లు సిద్ధం చేస్తున్నారని ఆమె వాపోయారు. ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు నిర్మించడం.. వారి శాంతియుత ఆందోళనను అడ్డుకోవడమేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతనలు నేరస్థులు కాదన్న విషయాన్ని అయినా పాలకులు గుర్తుంచుకోవాలని కోరారు. అణిచివేత ప్రయత్నాలు విరమించి తక్షణమే రైతులతో చర్చలు ద్వారా పరిష్కార మార్గాలు వెతకాలని కోరారు.

చర్చలకు సిద్ధంగా ఉన్నాం : అర్జున్‌ ముండా

రైతులతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా వెల్లడించారు. సాధారణ జనజీవనం భగం కాకుండా చూడాలని తాను రైతు సంఘాలను కోరుతున్నానని, అలాగే, రైతు నాయకులతో నిర్మాణాత్మక చర్చలకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన నిర్బంధ చర్యలను విడనాడి, చర్చలకు సహృద్బావ వాతావరణం కల్పించాలని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ బుధవారం అభ్యర్థించారు. పాదయాత్ర చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు సెల్ఫ్‌లోడింగ్‌ రైఫిల్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌)ను ప్లాస్టిక్‌, రబ్బరు బుల్లెట్‌లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.

➡️