పిటిషనర్‌ ఆరోపణలన్నీ అవాస్తవం

Jan 30,2024 11:27 #Supreme Court, #Tamil Nadu

తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ వ్యతిరేకి’గా చూపే యత్నం :  సుప్రీంకోర్టులో రాష్ట్ర డిజిపి

న్యూఢిల్లీ  : ‘అయోధ్య ఆలయం ప్రత్యక్ష ప్రసారం’ కేసును తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ వ్యతిరేకి’గా చూపే ప్రయత్నమని ఆ రాష్ట్ర డిజిపి శంకర్‌ జివాల్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ నెల 22న అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ‘మౌఖిక’ ఆదేశాలు జారీ చేశారని చెన్నై నివాసి వినోజ్‌ పన్నీర్‌సెల్వం తరుపున సీనియర్‌ న్యాయవాది దామా శేషాదిరి నాయుడు, న్యాయవాది జి. బాలాజీ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం సంక్షిప్త విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసు ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, పిటీషనర్‌ అక్కడ సంప్రదించాలని తమిళనాడు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ అమిత్‌ ఆనంద్‌ తివారీ తెలిపారు. తమిళనాడు డిజిపి శంకర్‌ జివాల్‌ తన ప్రత్యేక కౌంటర్‌ అఫిడవిట్‌లో ‘పిటీషనర్‌ ఆరోపణలన్నీ అవాస్తవాలు’ అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయం ప్రారంభత్సోవ ప్రత్యక్ష ప్రసారం, భజనలు, అన్నదానాలు, ఊరేగింపులు, పూజలు వంటి కార్యక్రమాలు పోలీసులు, అధికారుల జోక్యం లేకుండానే జరిగాయని చెప్పారు. ఆలయం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారంపై నిషేధం విధిస్తూ స్టాలిన్‌ ‘మౌఖిక’ ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. ఆలయం ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం, భజనలు వంటి కార్యక్రమాల కోసం మొత్తంగా 288 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ముందుగా నాలుగింటికి అనుమతి ఇచ్చామని, తరువాత మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో 248 కార్యక్రమాలకు అనుమతించామని డిజిపి తెలిపారు.

➡️