భయం..భయంగా బస్తర్‌ పోలింగ్‌

Apr 20,2024 11:13 #Bastar polling, #fear

రాయ్ పూర్‌ : భద్రతాదళాల కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన బస్తర్‌లో శుక్రవారం పోలింగ్‌ భారీ బందోబస్తు మధ్య జరిగింది. అనూహ్యంగా జరిగిన సంఘటన షాక్‌ నుండి స్థానిక గిరిజనులు ఇంకా కోలుకోలేదు. అయినా లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో ఓటు వేయడానికి పోలీస్‌ పహారా మధ్య బస్తర్‌లోని అనేక ప్రాంతాల్లో గిరిజనులు పోలింగ్‌స్టేషన్లకు వచ్చారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఉదయం ఏడు గంటలకు బస్తర్‌లో పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ ముగిసే సమయానికి 64శాతానికి పైగా ఓట్లు పోల్‌అయినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 66శాతానికి పైగా ఓట్లు పోల్‌ అయ్యాయి.
నిజానికి ప్రభుత్వ యంత్రాంగం పోలింగ్‌ ప్రక్రియను ప్రతిష్టగా తీసుకుంది. కాల్పుల సంఘటనకు ముందు, ఆ తరువాత కూడా పోలింగ్‌ ప్రక్రియను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. పోలింగ్‌ ప్రక్రియను బహిష్కరించాలని చాలారోజుల క్రితమే మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆమేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే. కాంకర్‌ కాల్పుల తరువాత స్థానికంగా ఎక్కడ చూసినా పోలీసులు, భద్రతాదళాలే కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

ఇంకా షాక్‌లోనే…
భద్రతా దళాలు కాల్పులు సృష్టించిన భయోత్పాతం నుండి గిరిజనులు ఇంకా కోలుకోలేదు. ఏం జరిగింది… ఎలా జరిగిందన్నదానిపై పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. నాలుగురోజుల తరువాత కూడా సంఘటన గురింని నోరుతెరచి మాట్లాడటానికి స్థానిక గిరిజనులు సిద్ధపడటంలేదు. పోలింగ్‌ రోజు కూడా అదే పరిస్థితి. కాల్పుల్లో మృతి చెందిన వారికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇంకా స్థానిక గిరిజనులకు చేరలేదు. పోలీస్‌ అధికారులు కూడా మరణించిన అందరి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు సంఘటన స్థలంలో 50 నుండి 70 మందిదాకా మావోయిస్టులు ఉన్నట్లు చెబుతున్నారు. సంఘటన స్థలంలో దొరికింది 29 మృత దేహాలే కావడంతో మిగిలిన వారు ఏమయ్యారన్న ఆందోళన స్థానిక కుటుంబాల్లో నెలకొంది. బస్తర్‌ అంతా భారీ సంఖ్యలో భద్రతా దళాలు మొహరించి ఉండటం, పెద్ద ఎత్తున నిఘా దళాలు సంచరిస్తుండటంతో వారి కళ్లు కప్పి తప్పించుకోవడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఏ క్షణంలో ఏ వార్త వినాల్సివస్తుందోనన్న అందోళన స్థానికంగా నెలకొంది.

బలగాల మోహరింపు….
కొన్ని సంవత్సరాల క్రితం 25 వేలగా ఉన్న భద్రతా దళాలు ప్రస్తుతం దాదాపుగా లక్షమందికి చేరినట్లు కొద్దిరోజుల క్రితం బస్తర్‌ ఐజి పి.సుందర్‌రాజ్‌ చెప్పిన విషయం తెలిసిందే. మావోయిస్టులపై చర్యలు తీసుకోవడమే వీరి ప్రధాన పని. పోలింగ్‌ ప్రశాంత నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్‌ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణలతో పాటు సమీప ప్రాంతాల నుండి భారీ ఎత్తున అదనపు దళాలను బస్తర్‌కు తరలించింది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 1961 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ పర్యవేక్షణ కోసం ఏడు హెలికాప్టర్లను వినియోగించారు. అన్ని సమస్యాత్యక పోలింగ్‌ స్టేషన్ల వద్ద కూడా బిఎస్‌ఎఫ్‌ దళాలను మొహరించారు. వీరుగాక 300 కంపెనీల రాష్ట్ర పోలీసులు, 350 కంపెనీల సిఎపిఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ దళాలు కూడా ఎన్నికల విధుల్లో ఉన్నాయి. (వీరందరూ కలిపి 60వేల మందికన్నా పైనే) ఇవిగాక సాధారణంగా జరిగే పోలీస్‌ పెట్రోలింగ్‌, డ్రోన్లతో నిఘా యథావిధిగా కొనసాగాయి.

➡️