బెంగళూరులో నీటి కటకట

Mar 8,2024 16:56 #Bengaluru water crisis

బెంగళూరు : వేసవి ప్రారంభంలోనే బెంగళూరు నగర వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరవాసుల నీటికష్టాల్ని తీర్చడానికి వాహనాలను కడగడం, తోటపని, వినోదం కోసం వాటర్‌ ఫౌంటైన్‌ల వంటి వాటికి నీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్టు (బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్ని ఉల్లంఘించిన వారికి పౌర సంఘం ఐదువేల రూపాయల జరిమానా విధించింది. మళ్లీ మళ్లీ ఉల్లంఘించిన వారికి ఐదువేల జరిమానాకి మరో ఐదు వందలు జోడించబడుతుందని పౌర సంఘం ఆదేశాల్లో తెలిపింది. దీనికోసం బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ని కూడా ప్రారంభించింది. ఈ ఉత్తర్వులను పౌరులు ఉల్లంఘిస్తే వెంటనే 1916కు కాల్‌చేయాలని కోరింది. మాల్స్‌, సినిమా హాల్స్‌లో కూడా తాగునీరు, రోడ్లు శుభ్రం చేయడం, ఇతర క్లీనింగ్‌ పనులకు మాత్రమే నీటిని వినియోగించాలని (బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి) ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగరంతోపాటు పలు జిల్లాల్లో కూడా నీటికొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. నీటికొరతను తీర్చేందుకు బెంగళూరు నగరపాలక సంస్థలు, జిల్లా యంత్రాగం నగరంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అనవసర ప్రయోజనాల కోసం తాగునీటి వినియోగాన్ని నిషేధించేందుకు చట్టం 1964 33, 34 ప్రకారం బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నీటికొరతను తీర్చేందుకు బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

➡️