రాహుల్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు .. అస్సాంలో ఉద్రిక్తత

 న్యూఢిల్లీ :   రాహుల్‌ జోడో న్యాయ్  యాత్ర అస్సాం రాజధాని గువహటిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసివేస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్‌ జామ్‌లను నివారించేందుకు యాత్రను నగరంలోకి అనుమతించడం లేదని సోమవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పేర్కొనడం గమనార్హం.

ఐదువేలకు పైగా కాంగ్రెస్‌ కార్యకర్తలు గువాహటికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బారికేడ్లతో అడ్డుకునేందుకు యత్నించారు. ఆగ్రహించిన కార్యకర్తలు బారికేడ్లను దాటుకుని దూసుకువెళ్లారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతలపై రాహుల్‌ మాట్లాడారు. ”ఇదే మార్గంలో బజ్‌రంగ్‌ దళ్‌ యాత్ర చేపట్టింది. బిజెపి చీఫ్‌ నడ్డా ర్యాలీ నిర్వహించారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు మాత్రం మాకు బారికేడ్లు పెట్టారు. మేం బారికేడ్లను మాత్రమే దాటాం. చట్టాన్ని అతిక్రమించలేదు. మమ్మల్ని బలహీనులమని అనుకోకండి. కాంగ్రెస్‌ కార్యకర్తల శక్తి ఇది ” అని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాల్సిందిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోలీసులను ఆదేశించారు.

మేఘాలయ యూనివర్శిటీలోకి అనుమతి నిరాకరణపై రాహుల్‌ ధ్వజం 

మేఘాలయ యూనివర్శిటీలోకి కేంద్రం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. విద్యార్థులతో ముఖాముఖీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచనల మేరకే అధికారులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. అస్సాం-మేఘాలయ సరిహద్దులో జోడో న్యారు యాత్ర చేపడుతున్న బస్సు నుండి విద్యార్థులు, కార్యకర్తలను ఉద్దేశించి మంగళవారం రాహుల్‌ ప్రసంగించారు. మేఘాలయలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్శిటీ విద్యార్థులు, పౌర సమాజ సభ్యులు మరియు పార్టీ ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరపాల్సి వుందని, అయితే యూనివర్శిటీ అనుమతిని వెనక్కి తీసుకుందని అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి హోంమంత్రి యూనివర్శిటీ అధికారులకు ఆదేశాలను పంపారని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

” నేను మీ యూనివర్శిటీకి వచ్చి ప్రసంగించాలని, మీ మాటలు వినాలని భావించాను. కానీ ఏమైంది. భారత హోంమంత్రి అస్సాం ముఖ్యమంత్రికి ఫోన్‌చేసి, సిఎంఒ నుండి యూనివర్శిటీకి ఫోన్‌ చేసి రాహుల్‌ గాంధీని విద్యార్థులతో మాట్లాడేందుకు అనుమతించవద్దు ” అని చెప్పారని అన్నారు. ” రాహుల్‌ గాంధీని అనుమతిస్తారా లేదా అనేది ముఖ్యం కాదు. మీకు నచ్చిన వారి ప్రసంగాలను వినేందుకు మీకు అవకాశం ఉండాలి. మీరు కోరుకున్నట్లుగా జీవించే స్వేచ్ఛ మీకు ఉండాలి” అని అన్నారు. ” ఈ ఆంక్షలు కేవలం అస్సాంలోనే కాదు. భారతదేశంలోని ప్రతి పాఠశాల, కళాశాల, యూనివర్శిటీలోనూ ఇదే పరిస్థితి, ఈ దేశంలో విద్యార్థులు తమ సొంత ఆలోచనలను కలిగి ఉండకూడదు” అని మండిపడ్డారు.

అస్సాంలోని నాగావ్‌కు సమీపంలోని బోర్దువాలో ఉన్న శ్రీ శంకరదేశ్‌ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా రాహుల్‌ గాంధీని స్థానిక పోలీసులు, అధికారులు సోమవారం అడ్డుకున్న సంగతి తెలిసిందే.

➡️