బిల్కిస్‌ బానో కేసు సుప్రీంకోర్టులో గుజరాత్‌ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌

Feb 15,2024 09:00 #Bilkis Bano Case, #Gujarat
Bilkis Bano case Review Petition by Gujarat Government in Supreme Court

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో సామూహిక లైంగికదాడి కేసులో గతనెల 8 నాటి సుప్రీంకోర్టు తీర్పుపై గుజరాత్‌ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. నాటి తీర్పులో న్యాయస్థానం రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు ‘అత్యంత అసమంజకరం’ అని గుజరాత్‌ ప్రభుత్వం పేర్కొన్నది. వాటిని తొలగించాలని కోరింది. 2002లో రాష్ట్రంలో జరిగిన మతపరమైన అల్లర్లలో బిల్కిస్‌ బానోపై సామూహిక లైంగికదాడి చేసి ఆమె కుటుంబానికి చెందిన 14 మందిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలి, యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మందికి గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేయటంపై సర్వోన్నత న్యాయస్థానం గతనెల 8న తీర్పులో అభ్యంతరం వ్యక్తం చేసింది. రెమిషన్‌ మంజూరు చేసిన గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వును సైతం కొట్టిపారేసింది. గుజరాత్‌ ప్రభుత్వం ”నిందితులతో సామరస్యపూర్వకంగా వ్యవహరించి, సహకరించింది” అని అత్యున్నత న్యాయస్థానం చేసిన పరిశీలన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని తన రివ్యూ పిటిషన్‌లో వాదించింది. 2022, మేలో నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే తాము పని చేశామని పేర్కొన్నది. రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తొలగించాలని పిటిషన్‌లో బీజేపీ ప్రభుత్వం కోరింది.

➡️