రెండోసారి ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతికి నివేదించలేరు

Dec 2,2023 08:37 #Supreme Court

-సిఎంతో సమావేశమై పరిష్కరించుకోండి

-తమిళనాడు గవర్నర్‌కు సుప్రీంకోర్టు సూచన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోశాసనసభ తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్‌ ఆమోదముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌తో సమావేశమై సమస్య పరిష్కరించుకోవాలని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. తాము ఉన్నతమైన రాజ్యాంగబద్ధ వ్యవస్థలతో వ్యవహరిస్తున్నామని చెబుతూనే.. శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్‌ పంపలేరని స్పష్టం చేసింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లులను తమిళనాడు అసెంబ్లీ మళ్లీ ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్‌ వాటిని రాష్ట్రపతికి రిజర్వ్‌ చేశారు’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘బిల్లుల ప్రతిష్టంభనకు గవర్నర్‌ తెరదించాలని కోరుకుంటున్నాం. ఈ దిశగా ముఖ్యమంత్రితో కలిసి నడిస్తే అభినందిస్తాం. సిఎంను గవర్నర్‌ ఆహ్వానించి.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతారని ఆశిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ఉన్నతమైన రాజ్యాంగబద్ధ వ్యవస్థల (గవర్నర్‌)తో వ్యవహరిస్తున్నామనే విషయం తెలుసని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తన ఆమోదాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తిరిగి ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతికి పంపడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌- 200’ను ప్రస్తావిస్తూ.. పున్ణపరిశీలన కోసం గవర్నర్‌ కార్యాలయం నుంచి తిరిగి వచ్చిన బిల్లులను శాసనసభ రెండోసారి ఆమోదించిన తరువాత గవర్నర్‌ వాటిని రాష్ట్రపతికి పంపలేరని స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం, గవర్నర్‌కు మూడు ఎంపికలు ఉన్నాయి. ఆయన బిల్లుపై సమ్మతి తెలపవచ్చు. నిలిపివేయవచ్చు. ఆయన బిల్లును (పరిశీలన) రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయవచ్చు. ఈ అన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘ఈ కేసులో గవర్నర్‌ మొదట సమ్మతిని నిలుపుదల చేశారు. ఒకసారి ఆయన సమ్మతిని నిలిపివేస్తే, దానిని రాష్ట్రపతికి రిజర్వ్‌ చేసే ప్రశ్నే లేదు. ఆయన రాష్ట్రపతికి పంపలేరు. ఆయన మూడు ఎంపికలలో ఒకదాన్ని అనుసరించాలి. ఒకసారి ఆయన సమ్మతిని నిలుపుదల చేస్తే, నిబంధన ఆయనకు నాల్గో ఎంపికను ఇవ్వదు’ అని తమిళనాడు గవర్నర్‌ తరపున హాజరైన అటార్నీ జనరల్‌ (ఎజెఐ) ఆర్‌ వెంకటరమణికి సిజెఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

➡️