మోడీని ఆరాధించే మతంగా మారిన బిజెపి : చిదంబరం ఎద్దేవా

Apr 22,2024 00:40 #BJP, #Chidambaram

న్యూఢిల్లీ : బిజెపి అనేది ఒక రాజకీయ పార్టీ కాదని, అది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని ఆరాధించే మతంగా మారిందని కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం విమర్శించారు. బిజెపి రాజకీయ పార్టీ కాదు.. అది ఒక కల్ట్‌గా మారిందని, ఆ మతం నరేంద్ర మోడీని ఆరాధిస్తున్నదని చిదంబరం అన్నారు. ప్రస్తుతం దేశంలో మతపరమైన ఆరాధన బలం పెరుగుతోందని, ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నిరుద్యోగమని అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి గురించి పేర్కొన్నట్లు తెలిపారు. పదేళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా నశించాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకుంటున్నారని చిదంబరం తెలిపారు. ఇండియా వేదిక అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎఎను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రస్తావించలేదు. తమిళనాడులోని మొత్తం 39 ఎంపి స్థానాలను, పాండిచ్చేరిలోని ఒక సీటును ఇండియా వేదిక గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
14 రోజుల్లోనే బిజెపి తన మేనిఫెస్టోను రూపొందించిందని, అయితే దానికి మేనిఫెస్టో అని పేరు పెట్టలేదని, దానిని ‘మోడీ కి గ్యారెంటీ’ అని పెట్టారని విమర్శించారు.

➡️