బిజెపి ఐటి సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ లైంగిక వేధింపులు

  • ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు శంతను సిన్హా పోస్ట్‌
  •  లీగల్‌ నోటీసులిచ్చిన అమిత్‌

న్యూఢిల్లీ : బిజెపి ఐటి సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు శంతను సిన్హా ఆరోపించారు. ఈ మేరకు సిన్హా సోషల్‌ మీడియాలో ఒక పోస్టు చేశారు. బిజెపి నాయకుడు రాహుల్‌ సిన్హా అనుయాయుడిగా చెబుతారు. ‘బిజెపి ఐటి సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ నీచమైన కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. మహిళలపై లైంగిక దోపిడీ చేస్తున్నాడు. కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలోనే కాదు, పశ్చిమ బెంగాల్‌లోని బిజెపి కార్యాయాల్లోనూ మహిళలపై లైంగిక దోపిడీ చేస్తున్నాడు’ అని శంతను సిన్హాను తన పోస్టులో ఆరోపించారు. అమిత్‌్‌ మాలవీయ ఎదుర్కొంటున్న ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తే బిజెపి నాయకుడుపై లైంగిక ఆరోపణలు చేయడం అందరూ గుర్తించాల్సి విషయని కాంగ్రెస్‌ నాయకులు సుప్రియా శ్రీనాటే విలేకరుల సమావేశంలో అన్నారు. అమిత్‌ మాల్యవియాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ‘మేం బిజెపిని కోరేది ఒక్కటే. మహిళలకు న్యాయం చేయమని. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బిజెపికి చెందిన ప్రముఖ నాయకుడిపై లైంగిక దోపిడీకి సంబం ధించిన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి’ అని ఆమె అన్నారు.

శంతను సిన్హాకు అమిత్‌ లీగల్‌ నోటీసు
తనపై వచ్చిన ఆరోపణలను అమిత్‌ మాలవీయ ఖండించారు. శంతను సిన్హాకు లీగల్‌ నోటీసు పంపారు. ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోగా పోస్టును వెంటనే తొలగించాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. లేనిపక్షంలో తనకు పరువునష్టం, మానసిక వేదన కలిగించినందుకు నష్టపరిహారంగా రూ.10 కోట్లుచెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు.

➡️