బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సోదరుడు అరెస్ట్‌ ..

బెంగళూరు :   దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన పార్లమెంట్‌ భద్రతా వైఫల్య ఘటనలో వార్తల్లోకెక్కిన బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సోదరుడు అరెస్టయ్యారు. కోట్లాది రూపాయల విలువైన చెట్లను నరికినందుకు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ కస్టడీలో ఉన్నారు.

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో 126 కోట్లాది రూపాయల విలువైన చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ కేసులో అతని ప్రమేయం ఉన్నట్లు ‘అందుబాటులో ఉన్న డాక్యుమెంటరీ సాక్ష్యం’ సూచించిందని అధికారిక నివేదిక పేర్కొంది. అయితే విక్రమ్‌ సింహా పరారీలో ఉన్నారని, అతని ఆచూకీ కోసం ఎలక్ట్రానిక్‌ నిఘాని వినియోగించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీశాఖ అధికారులు, క్రైమ్‌ బ్రాంచ్‌ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో విక్రమ్‌ సింహాను అరెస్ట్‌ చేశారు. అతనిని హసన్‌కి తరలించనున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌ 13న ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలోకి చొరబడి పొగను విడుదల చేసిన ఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది.    అయితే చొరబాటుదారుల్లో ఒకరికి బిజెపి ఎంపి ప్రతాప్‌సింహా విజిటింగ్‌ పాస్‌ను జారీ చేసినట్లు నిర్థారణైంది. అయితే ఈ ఘటనలో ప్రతాప్‌ సింహాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు  కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.    ఈ ఘటనపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు  డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో 146 మంది ప్రతిపక్ష ఎంపిలపై  సస్పెండ్ వేటు వేయడం గమనార్హం.

➡️