నాలుగు నెలల్లో యాడ్స్‌ కోసం బిజెపి 39 కోట్ల ఖర్చు

ఎలక్షన్‌ డెస్క్‌ :ఈ ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని బిజెపి ఎత్తులు వేస్తోంది. ముందస్తు వ్యూహంగా యాడ్స్‌ రూపంలో విపరీతంగా ఖర్చు పెట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్‌డిఎ హయాంలో చేసిన పనులను ఏకరువు పెడుతూ.. మోడీ నిలువెత్తు ఫొటోలతో హంగామా చేసింది. ఆన్‌లైన్‌ యాడ్స్‌ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలం ఈ ఏడాది నాలుగు నెలల (జనవరి ా ఏప్రిల్‌ 11 వరకు) కాలంలో ఆన్‌లైన్‌ యాడ్స్‌ కోసం బిజెపి సుమారు రూ.39 కోట్లు ఖర్చు చేసిందని గూగుల్‌ యాడ్స్‌ ట్రాన్స్‌ప్రెన్సీ సెంటర్‌ లెక్కలే చెబుతున్నాయి. నాలుగు మాసాల్లో 80,667 గూగుల్‌ రాజకీయ ప్రకటనల కోసం రూ. రూ.39,41,78,750 పే చేసింది.
ఆ రాష్ట్రాలే టార్గెట్‌
ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలను బిజెపి లక్ష్యంగా చేసుకుని ప్రకటనల రూపంలో కోట్లాదిగా ఖర్చుపెట్టింది. ఒక్కో రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల కంటే ఎక్కువే ప్రకటనల రూపంలో ఖర్చుపెట్టినట్లు గూగుల్‌ ఇన్‌సైట్స్‌ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే యుపిలో 3.38 కోట్లు, లక్షద్వీప్‌లో 5 కోట్లను ఖర్చు చేసింది. దాదాపు మొత్తంగా 39.4 కోట్లలో 75 శాతం గూగుల్‌ వీడియో ప్రకటనలకు, 9.58 కోట్లు చిత్ర ప్రకటనల కోసం ఖర్చు చేసింది. హిందీ, ఇంగ్లీషు, వంటి వివిధ భాషలలో యాడ్స్‌ను రూపొందించారు.
కాంగ్రెస్‌ సైతం..
దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా గూగుల్‌ యాడ్స్‌ కోసం కోట్లాది రూపాయల్ని ఖర్చు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ 11 వరకు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సి) 736 ఆన్‌లైన్‌ యాడ్స్‌ కోసం రూ.8.12 కోట్లు ఖర్చు చేసింది. మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఖర్చు చేసింది. బిజెపి నాలుగు నెలల నుంచే పక్కా ప్రణాళికగా ఖర్చు పెట్టింది. కాంగ్రెస్‌ మాత్రం కేవలం ఏప్రిల్‌ ప్రారంభం నుంచే యాడ్స్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ వీడియో ఆధారిత ప్రకటనలకే కాంగ్రెస్‌ మొగ్గుచూపింది.

➡️