దళితుల మద్దతు కోల్పోయిన బిజెపి

Jun 11,2024 08:18 #Dalit, #votes
  • 16 సిట్టింగ్‌ రిజర్వుడ్‌ స్థానాల్లో ఓటమి
  • ‘ఇండియా’కే జై కొట్టిన ఎస్‌సిలు
  • ఆ పార్టీలకు 46 శాతం ఓట్లు

న్యూఢిల్లీ : దశాబ్ద కాలం తర్వాత లోక్‌సభలో బిజెపి మెజారిటీ కోల్పోయింది. 240 స్థానాలు గెలుచుకొని సభలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. భారీ మెజారిటీతో బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని ఓటర్లు విశ్వసించారు. ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాల వారు బిజెపిని పక్కన పెట్టి ఇండియా బ్లాక్‌కు ఓటేశారు. దేశంలో 156 లోక్‌సభ స్థానాల్లో ఎస్‌సిల ప్రభావం గణనీయంగా ఉంది. వీటిలో ఇండియా బ్లాక్‌కు 93, ఎన్‌డిఎకు 57, ఇతరులకు 6 స్థానాలు లభించాయి. ఎస్‌సిల ప్రాబల్యం అధికంగా ఉన్న స్థానాలకు సంబంధించి 2019 ఎన్నికలతో పోలిస్తే ఇండియా బ్లాక్‌ 53 సీట్లను అదనంగా గెలుచుకోగా, ఎన్‌డిఎ 34 స్థానాలను కోల్పోయింది. ఇతర పార్టీలు కూడా 19 స్థానాలను చేజార్చుకున్నాయి. రాజ్యాంగాన్ని మారిస్తే తమ మనుగడే ప్రమాదంలో పడుతుందని, తమ ఉపాధి వనరులు దెబ్బతింటాయని ఎస్‌సిలు ఆందోళన చెందారు. తాము గతంలో బిజెపికే ఓటు వేశామని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి తమకు నష్టం కలిగిస్తుందని, అందుకే ఈసారి సమాజ్‌వాదీ పార్టీకి ఓటేశామని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు బాహాటంగానే చెప్పారు.

ఎవరికి ఎన్ని ?
ఉత్తరప్రదేశ్‌లో బిజెపి గతంతో పోలిస్తే సగం స్థానాలను కోల్పోయింది. 2019 ఎన్నికల్లో కంటే ఆ పార్టీకి ఏకంగా 9 శాతం ఓట్లు తగ్గాయి. దళితులు, వెనుకబడిన తరగతుల వారు బిజెపిని వ్యతిరేకించారు. ముఖ్యంగా దళితులంతా ప్రతిపక్ష కూటమికే జై కొట్టారు. దేశ జనాభాలో ఎస్‌సిలు 17 శాతంగా ఉన్నారు. వీరిలో అత్యధికుల మద్దతును ఎన్‌డిఎ కోల్పోయిందని ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వే స్పష్టం చేసింది. ఆ మద్దతు ఈసారి ప్రతిపక్షాలకు లభించింది. ఎస్‌సిల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 6 శాతం ఓట్లను కోల్పోగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌ రెండంకెల ఓటు షేర్‌ను పొందింది. 2019 ఎన్నికల్లో ఎన్‌డిఎకు 41 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 35 శాతం మాత్రమే వచ్చాయి. అదే సమయంలో ప్రతిపక్ష కూటమి ఓట్లు 46 శాతానికి పెరిగాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది 18 శాతం ఎకుచ్కవ. ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ, ఇండియా బ్లాక్‌ సాధించిన ఓట్ల మధ్య 11 శాతం వ్యత్యాసం ఉంది. ఇతర పార్టీలకు లభించిన ఓట్లు 31 శాతం నుంచి 19 శాతానికి తగ్గిపోయాయి.

ఏ గట్టునా లేని వారికీ నిరాశే
ఎస్‌సిలలో ఎన్‌డిఎ యేతర, ఇండియా బ్లాక్‌ యేతర పార్టీల ఓటింగ్‌ 12 శాతం పడిపోయింది.
2019 ఎన్నికల్లో ఎన్‌డిఎ, ఇతరులతో పోలిస్తే ప్రస్తుత ఇండియా బ్లాక్‌లోని పార్టీలకు ఎస్‌సిల్లో పెద్దగా ఆదరణ లభించలేదు. ఈ ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అయింది. ఎస్‌సిల్లో దాదాపు సగం (46 శాతం) ఓట్లు ఇండియా బ్లాక్‌కు పడ్డాయి.

రిజర్వ్‌డ్‌ స్థానాల్లో…
లోక్‌సభలో 84 ఎస్‌సి రిజర్వ్‌డ్‌ స్థానాలు ఉన్నాయి. 2014లో వీటిలో కాంగ్రెస్‌కు 7, బిజెపికి 40, ఇతరులకు 37 స్థానాలు వచ్చాయి. 2019లో కాంగ్రెస్‌కు 6, బిజెపికి 46, ఇతరులకు 32 సీట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 20, బిజెపికి 30, ఇతరులకు 34 స్థానాలు దక్కాయి. ఓట్ల శాతం విషయానికి వస్తే 2014లో కాంగ్రెస్‌కు 17.6 శాతం, బిజెపికి 27.6 శాతం, ఇతరులకు 54.8 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో కాంగ్రెస్‌కు 16.7 శాతం, బిజెపికి 35.3 శాతం, ఇతరులకు 47.9 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21.1 శాతం, బిజెపికి 35.2 శాతం, ఇతరులకు 43.7 శాతం ఓట్లు లభించాయి. 2019లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల కంటే బిజెపికి రెట్టింపు ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్‌ ఓట్లు 21 శాతానికి పెరిగాయి. ఓట్లు సుమారు ఐదు శాతం పెరగ్గా సీట్లు మాత్రం మూడు రెట్లకు పైగా పెరిగాయి. అదే సమయంలో బిజెపి భారీగా… 16 స్థానాలు నష్టపోయింది. ఈ ఎన్నికల్లో బిజెపి కోల్పోయిన మొత్తం స్థానాల్లో ఇది నాలుగో వంతు.

బిఎస్‌పి దెబ్బతినడంతో…
ఒకప్పుడు ఎస్‌సిల ఓట్లను అధిక సంఖ్యలో సాధించి ఓ వెలుగు వెలిగిన బిఎస్‌పి ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. గతంలో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న ఎస్‌సిలు ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం బిజెపికి నష్టం కలిగిస్తోంది. ఇండియా టుడే పత్రికకు చెందిన ఎలక్షన్‌ ఇంటెలిజెన్స్‌ డాష్‌బోర్డు ప్రకారం 156 లోక్‌సభ స్థానాల్లో ఎస్‌సిల సంఖ్య గణనీయంగా ఉంది. వీటిలో ఇండియా బ్లాక్‌ 93, ఎన్‌డిఎ 57 స్థానాలు గెలుచుకున్నాయి. 2019తో పోలిస్తే ఇండియా బ్లాక్‌ 53 స్థానాలను అదనంగా గెలుచుకోగా, ఎన్‌డిఎ 34 సీట్లు కోల్పోయింది.

➡️