ఇద్దరూ.. ఇద్దరే!

Apr 18,2024 03:20 #2024 elections, #CPM Candidates
  • తమిళనాట ఎర్రజెండా రెపరెపలు
  •  డిఎంకె కూటమిలో రెండు స్థానాల్లో సిపిిఎం పోటీ

తమిళనాడు రాష్ట్రంలో ఈనెల 19న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకె కూటమి నుంచి సర్దుబాటులో భాగంగా పోటీలో నిలిచిన వామపక్షాల అభ్యర్థులకు ప్రజాదరణ కనిపిస్తోంది. సిపిఎంకు ఇద్దరు, సిపిఐకి ఇద్దరు పొత్తులో భాగంగా బరిలో ఉన్నారు. సిపిఎం నుంచి మదురై సిట్టింగ్‌ ఎంపి సు.వెంకటేశన్‌, దిండిగల్‌ నుంచి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్‌.సచ్చిదానంద్‌ పోటీ చేస్తున్నారు. నాగపట్నం నుంచి సిపిఐ అభ్యర్థి సెల్వరాజ్‌, తిరుపూర్‌ నుంచి సుబ్బరాయన్‌ పోటీలో ఉన్నారు. డిఎంకె, కాంగ్రెస్‌, విసికె, ఇండియన్‌ ముస్లీం లీగ్‌ కూటమికి దళిత బిసి, కార్మిక ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రచారంలో అందరికంటే దూసుకెళుతున్నారు వామపక్ష అభ్యర్థులు.

ప్రజా ఉద్యమాలే ఊపిరిగా..
కూటమిలో భాగస్వామ్యంగా మదురై, దిండిగల్‌ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు సు.వెంకటేశన్‌, ఆర్‌.సచ్చిదానంద్‌ ఇద్దరూ ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తున్నవారే. మదురై నుంచి సిట్టింగ్‌ ఎంపిగా పోటీ చేస్తున్న సు.వెంకటేశన్‌ ఐదేళ్లుగా ఎంపిగా ఉన్నారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావజాలానికి ఆకర్షితులయ్యారు. రచయితగానూ రాణిస్తూ ఎన్నో పుస్తకాలను రచించారు. బికాం వరకూ చదువుకుని మధ్యలోనే నిలిచిపోయారు. ఉద్యమాల పత్రిక థికదీర్‌ లో సబ్‌ఎడిటర్‌గా ఉన్నారు. సిపిఎం ఏరియా కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన రచించిన పుస్తకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. సామాన్య ప్రజానీకానికి అర్ధమయ్యే రీతిలో వారి బాధలే ఆ పుస్తకాల్లో ఉండడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభ్యుదయ రచయితగా పేరు ఉంది. రెడ్‌ఫ్లవర్‌, కావల్‌పొట్టమ్‌ వీరి ప్రసిద్ధి రచనలు. రచనలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తమిళనాడు రాష్ట్ర సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులుగానూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో డిఎంకె కూటమిలో మదురై నుంచి పోటీ చేసి అన్నాడిఎంకె అభ్యర్థి సత్యాయాన్‌పై లక్షా 5వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కరోనా కాలంలో మదురై జిల్లాలో విశేష సేవలను అందించారు. 26వేల మంది పాజిటివ్‌ రోగులకు ఆశ్రయం కల్పించారు. నియోజకవర్గంలో ఎంపి నిధులతో నిధులు వెచ్చించి విద్యార్థులకు ట్రైనింగ్‌ ద్వారా ఉన్నత చదువులకు అవకాశం కల్పించారు. పదివేల మందికిపైగా విద్యార్థులు లబ్ధి పొందారు. ప్రస్తుతం అన్నాడిఎంకె అభ్యర్థి డాక్టర్‌ శరవణ్‌ ప్రధాన ప్రత్యర్థి.

సర్పంచి నుంచి ఎంపి అభ్యర్థిగా
దిండిగల్‌ సిపిఎం ఎంపి అభ్యర్థి ఆర్‌.సచ్చిదానంద్‌ సర్పంచి స్థాయి నుంచి ఎంపి అభ్యర్థి స్థాయి వరకూ ఎదిగారు. దిండిగల్‌ లోక్‌సభ నియోజకవర్గం సిపిఎంకు కంచుకోట. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధికమైన పార్టీ సభ్యులు ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే పళణి యాత్రాస్థలం ఉంది. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు ఎ.బాలసుబ్రమణ్యం, రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.వరదరాజన్‌ (లేట్‌) ఈ ప్రాంతం నుంచి వచ్చినవారే. విద్యార్థి స్థాయి నుంచే ఉద్యమాల్లో పాల్గొంటూ డివైఎఫ్‌ఐ, ఆలిండియా కిసాన్‌ కౌన్సిల్‌ స్థాయికి ఎదిగారు. దిండిగల్‌ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. దిండిగల్‌, పళణి, వేడసందూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడుసార్లు సిపిఎం ఎంఎల్‌ఎలు గెలుపొందారు. ఎస్‌డిపి ముస్లీం పార్టీ నుంచి మహ్మద్‌ ముబారక్‌ ప్రధాన పోటీదారుగా ఉన్నారు. అన్నాడిఎంకె, పిఎంకెలూ పోటీలో ఉన్నాయి. 2019లో రాష్ట్రంలోనే అత్యధికంగా 5 లక్షల మెజార్టీతో డిఎంకె అభ్యరి దిండిగల్‌లో గెలుపొందారు.

గోపి వలిగలం

➡️