స్కూళ్లలో ప్రధాని ప్రసంగాన్ని ప్రసారం చేయండి

Mar 13,2024 08:27 #BJP Controversy, #PM Modi

వికసిత్‌ భారత్‌ పోస్టర్లను ఏర్పాటు చేయండి
మోడీ ప్రభుత్వ హుకుం
విద్యావేత్తల విమర్శ
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజులలో ఎన్నికల షెడ్యూలు కూడా విడుదల కాబోతోంది. ఆ వెంటనే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. కోడ్‌ అమలులోకి వచ్చే లోగా ఓటర్లను ఆకర్షించేందుకు అధికారిక కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోడీ బుధవారం గుజరాత్‌, అసోం రాష్ట్రాలలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసే అధికారిక కార్యక్రమాలలో ప్రసంగిస్తారు. స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు (హెచ్‌ఈఐలు) కేంద్రం హుకుం జారీ చేసింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువతను బీజేపీ వైపు ఆకర్షించేందుకు అధికార కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారని ‘టెలిగ్రాఫ్‌’ పత్రిక తెలిపింది.
గుజరాత్‌లోని ధొలేరా, సనంద్‌, అసోంలోని మోరిగాన్‌లో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటికి ప్రధాని భూమిపూజ చేయడం తప్పేమీ కాదు కానీ ఆయన ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రసారం చేయాలని అనుకోవడం ‘ప్రచార కార్యక్రమం’ మినహా మరొకటి కాదని విద్యావేత్తలు అంటున్నారు. ఇది ఉన్నత విద్యా సంస్థల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే అవుతుందని విమర్శిస్తున్నారు. కార్యక్రమాలు జరిగే ప్రదేశాలలో మోడీ చిత్రాలతో కూడిన వికసిత్‌ భారత్‌ పోస్టర్లను ఏర్పాటు చేయాలని విద్యా శాఖ హెచ్‌ఈఐలను ఆదేశించింది. తన ఆదేశాలను పాటించిందీ లేనిదీ కార్యక్రమం పూర్తయిన తర్వాత నివేదిక రూపంలో తెలియజేయాలని కూడా సూచించింది. దేశంలోని రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలు సహా అన్ని యూనివర్సిటీలలో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రసారం చేయాలో కూడా మంత్రిత్వ శాఖ, యూజీసీ సూచించాయి. ‘కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఐదు పోస్టర్ల డిజైన్లను పంపుతున్నాం. విద్యార్థులకు ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని అందించండి. వికసిత్‌ భారత్‌ విజన్‌ దిశగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములయ్యేలా చూడండి’ అని హెచ్‌ఈఐలకు రాసిన లేఖలో యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషీ వివరించారు.

విద్యావేత్తల విమర్శ
ఇది లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహించే ప్రచార కార్యక్రమం మాత్రమేనని మిరండా హౌస్‌ కళాశాల ఉపాధ్యాయుడు అబా దేవ్‌ హబీబ్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ ఉద్దేశంతో ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం సరికాదని ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు అశోక్‌ అగర్వాల్‌ చెప్పారు. రాజకీయ ఉద్దేశాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమం కోసం సమయాన్ని వెచ్చించాలని విద్యా సంస్థలను బలవంతం చేయడం తప్పుడు చర్య అని అన్నారు. ఉన్నత విద్యా సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగినవని, ఇలాంటి ఆదేశాలను బేఖాతరు చేసే అధికారం వాటికి ఉన్నదని, అయితే తమపై వేధింపులకు పాల్పడతారన్న భయంతో ఆ సంస్థలు అలా చేయడానికి సాహసించవని ఆయన తెలిపారు.

ఇది మొదటిసారి కాదు
ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు విద్యా సంస్థలను వాడుకోవడం ఇది మొదటిసారి కాదు. యూనివర్సిటీలు, కాలేజీల ఆవరణల్లో మోడీ ప్రభుత్వ ‘బేటీ బచావ్‌ బేటీ పఢావ్‌’ లోగోలను ఏర్పాటు చేయాలని గతంలో యూజీసీ ఆదేశించింది. మోడీ నేపథ్యంలో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని గత సంవత్సరం డిసెంబరులో హుకుం జారీ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దత్తాజీ దిదోల్కర్‌ జయంతి ఉత్సవాలలో విద్యార్థులు పాల్గొనేలా చూడాలని కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ సూచనలు చేసింది.

 

➡️