CAA: రాజ్యాంగ పునాదిపైనే దాడి

Mar 14,2024 07:38 #CAA, #opposition parties

సిఎఎపై సర్వత్రా విమర్శలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన సిఎఎను ‘దేశ రాజ్యాంగం యొక్క పునాదిపై దాడి’గా సిపిఎం నాయకులు ఎంవై తరిగామి విమర్శించారు. ‘దేశ రాజ్యాంగానికి లౌకిక ప్రజాస్వామ్యం పునాది. అయితే దురదృష్టవశాత్తూ ప్రసుత్త కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా రాజ్యాంగంలోని లౌకిక లక్షణాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగుతోంది. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన సిఎఎ ద్వారా కూడా మైనార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు అడుగువేశారు’ అని తరిగామి విమర్శించారు.
సిఎఎ అనేది పౌరుల రాజ్యాంగ విలువలను లక్ష్యంగా చేసుకుంటుందని తరిగామి ఆరోపించారు. ఈ చట్టం వచ్చినప్పుడే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయని, అయినా త్వరలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ మైనార్టీ వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారని, ఇది ప్రజల మధ్య విభజన తేవడానికి ప్రయత్నమని విమర్శించారు. ఈ చట్టం తమకు ఆమోదయోగ్యం కాదని సిపిఎం ఇప్పటికే స్పష్టం చేసిందని తరిగామి గుర్తు చేశారు. కేరళ వంటి సిపిఎం పాలిత రాష్ట్రాలు సిఎఎను అమలు చేయబోమని తమ వైఖరిని వెల్లడించాయని కూడా తరిగామి తెలిపారు.

సిఎఎతో వలసలు పెరుగుతాయి : కేజ్రీవాల్‌
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా కేంద్రం సిఎఎను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. ‘ఇదో మురికి ఓటు బ్యాంకు రాజకీయం. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వలసదారులకు పౌరసత్వం ఇచ్చి వారికి బిజెపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆశ్రయం కల్పిస్తుంది. దీనివల్ల భవిష్యత్‌లో బిజెపికి ఓటు బ్యాంకు పెరుగుతుంది. వారి రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని’ మండిపడ్డారు. ‘ఇప్పటికే దేశంలో ఉన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించకుండా సిఎఎ గురించి కేంద్రం మాట్లాడుతోంది. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామంటున్నారు. కాని ఒకసారి తలుపులు తెరిచిన తరువాత మిగిలినవారు ఊరుకుంటారా… పెద్ద సంఖ్యలో వలసదారులు భారతదేశంలోకి రావడం ప్రారంభిస్తారు. మూడు దేశాల్లో 30 మిలియన్లకు పైగా మైనారిటీలు నివసిస్తున్నారు. 15 మిలియన్ల మంది భారత్‌కు వచ్చినా వారు ఎక్కడ స్థిరపడతారు, వారికి ఉద్యోగాలు ఎవరు ఇస్తారు. ఇది దేశానికి ప్రమాదకరం. ఇప్పటికే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసదారులు రావడం వల్ల అస్సాం ప్రజల భాష, సంస్కతి ఇబ్బందుల్లో పడ్డాయని” ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

సిఎఎను అందుకే వ్యతిరేకిస్తున్నాం : మమత
సిఎఎ అనేది జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌సిఆర్‌)తో ముడిపడి ఉందని, అందుకే సిఎఎను వ్యతిరేకిస్తున్నామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి చీఫ్‌ మమతా బెనర్జీ బుధవారం తెలిపారు. అలాగే, అస్సాంలో మాదిరిగా పశ్చిమ బెంగాల్‌లో డిటెన్షన్‌ క్యాంపులు (నిర్బంధ శిబిరాలు) తాము కోరుకోవడం లేదని చెప్పారు. అలాగే లోక్‌సభ ఎన్నికలకు ముందు సిఎఎను అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడాన్ని ఒక రాజకీయ జిమ్మిక్‌గా మమత విమర్శించారు. అలాగే టిఎంసి ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులకు వ్యతిరేకంగా విమర్శలు చేసినందుకు తన సోదరుడు బాబూన్‌ బెనర్జీపై కూడా మమత బెనర్జీ విమర్శలు చేశారు. అతనితో అన్ని సంబంధాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ‘నేను, నా కుటుంబం అతనితో అన్ని సంబంధాలను వదులుకున్నాం. నేను అత్యాశపరులను ఇష్టపడను. అతను చెప్పింది నేను విన్నాను. అతను బిజెపితో టచ్‌లో ఉన్నాడు. అతను కోరుకున్నది చేయగలడు. దయచేసి మాతో అతన్ని కలపవద్దు’ అని మమతా బెనర్జీ తెలిపారు.

వివక్షాపూరితం

సిఎఎపై ఐరాస, అమెరికా ఆందోళన
న్యూయార్క్‌ : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై అంతర్జాతీయ సమాజం నుంచీ ఆందోళన వ్యక్తమవుతునది. సిఎఎ అమలు నిబంధనల నోటిఫికేషన్‌పై అమెరికా, ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని ‘రాయిటర్స్‌’ నివేదించింది. ” పౌరసత్వ సవరణ చట్టం ప్రాథమికంగా వివక్షాపూరితమైనది. భారతదేశ అంతర్జాతీయ మానవ హక్కుల బాధ్యతలను ఉల్లంఘించేది” అని యూఎన్‌ ఆందోళన చెందుతున్నదని ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం ప్రతినిధి వివరించారు. నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి లోబడి ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధ్య యనం చేస్తున్నామని పేర్కొన్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ స్టేట్‌ డిపార్ట్‌ మెంట్‌ కూడా నిబంధనల నోటిఫికేషన్‌ గురించి ఆందోళన చెందు తున్నట్టు వివరించింది. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నది. మత స్వేచ్ఛను గౌరవించటం, అన్ని వర్గాలను సమానంగా చూడటం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు అని రాష్ట్ర శాఖ ప్రతినిధి వివరించారు.

 

➡️