ముంబయి : ఈ సంవత్సర ప్రారంభంలో ముంబయిలో నూతనంగా నిర్మించిన ‘అటల్ సేతు’ వంతెనపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసుల వివరాల మేరకు … ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రారుగఢ్ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న కారు అటల్ సేతుపైకి చేరుకోగానే ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే వాహనం సముద్రంలో పడేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగు చూసింది. అటల్ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయగఢ్ జిల్లాలోని నవశేవాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను జనవరి 12న ప్రధాని మోడి ప్రారంభించారు. ఆరు లేన్లుగా నిర్మించిన ఈ వంతెనపై గరిష్ఠ వేగం 100 కి.మీ.లు కాగా, కనిష్ఠ వేగం 40 కి.మీ.లుగా నిర్దేశించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు. దీని మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.