ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని జెపి నడ్డా, అమిత్‌, విజయేంద్రపై కేసు

May 7,2024 00:18 #BJP, #leaders, #police case

బెంగళూరు : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ ఐటి సెల్‌ అధ్యక్షులు అమిత్‌ మాలవీయ, పార్టీ కర్ణాటక అధ్యక్షులు బివై విజయేంద్రపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కెపిసిసి) చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సోషల్‌ మీడియా పోస్టులో ఒక అభ్యర్థికి ఓటు వేయవద్దని ఎస్‌సి, ఎస్‌టి ప్రజలను బిజెపి నాయకులు బెదిరింపులకు గురి చేశారని కెపిసిసి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఐపిసిలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 505 (2) ప్రకారం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక బిజెపి అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియోను కూడా ఫిర్యాదులో కాంగ్రెస్‌ జత చేసింది. బిజెపి పోస్టు చేసిన వీడియో ఉద్దేశపూర్వకంగా అల్లర్లను రెచ్చగొట్టడం, వివిధ మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయవద్దని ఎస్‌సి, ఎస్‌టిలను బెదిరించడం, ప్రజల మధ్య సామరస్యాన్ని విఘాతం కలిగించేదిగా ఉందని కాంగ్రెస్‌ తన ఫిర్యాదులో పేర్కొంది.

➡️