జార్ఖండ్‌ సిఎంగా చంపాయి సోరేన్‌ ప్రమాణస్వీకారం

Feb 2,2024 21:50 #Champai Soren, #Jharkhand

5న బల నిరూపణ

రాంచీ : జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా చంపాయి సోరేన్‌ (67)శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయనతోపాటు క్యాబినెట్‌ మంత్రులుగా సత్యానంద్‌ భోక్త, అలంగీర్‌ అలంలతో గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ ప్రమాణం చేయించారు. అనంతరం క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి, ఈ నెల 5న బలనిరూపణ చేయాలని నిర్ణయించారు. మంత్రి అలంగీర్‌ అలం మిలేకరులతో మాట్లాడుతూ ఈ సంగతి తెలియజేశారు. చంపాయి సోరెన్‌కు జార్ఖండ్‌ టైగర్‌ అని పిలుస్తారు. బీహార్‌ దక్షిణ ప్రాంతాన్ని ప్రత్యేక జార్ఖండ్‌ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1990 వ దశకంలో సాగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గన్నారు. 2000లో జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడింది. జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. జార్ఖండ్‌ ఏడవ ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు నిలిచారు. శిబు సోరెన్‌, ఆయన కుమారుడు హేమంత్‌ సోరెన్‌ తరువాత ఈ పదవిని చేపట్టిన మూడవ వ్యక్తి ఆయనే. మనీ లాండరింగ్‌ కేసులో ఇడి అరెస్టు చేయడానికి ముందే అంటే జనవరి 31న హేమంత్‌ సోరేన్‌ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానే చంపాయి సోరెన్‌ను తమ కొత్త నాయకుడిగా జెఎంఎం శాసన సభా పక్షం ఎన్నుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించే విషయంలో గవర్నర్‌ రెండు రోజుల పాటు తాత్సారం చేయడం పలు విమర్శలకు దారి తీసింది. పార్లమెంటులో దీనిపై ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి.జార్ఖండ్‌లోని కొల్హాన్‌ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంపాయి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు.. నూతన ప్రభుత్వానికి బల నిరూపణ కోసం 10 రోజుల సమయం ఇచ్చారని అధికార కూటమిలోని ఒకటైన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్‌ ఠాకూర్‌ తెలిపారు. ‘మేం అంతా ఐక్యంగా ఉన్నాం. మా కూటమి చాలా బలంగా ఉంది’ అని అన్నారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో అధికార కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జెఎంఎంకు 29, కాంగ్రెస్‌కు 17, ఆర్‌జెడికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు బిజెపికి 26 మంది, ఎజెఎస్‌యుకు ముగ్గురు ఉన్నారు. ఎన్‌సిపి, సిపిఐ (ఎంఎల్‌)లకు చెరో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. బిజెపి కుట్రలకు పాల్పడుతుందనే భయంతో అధికార కూటమి తన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది.

➡️