శిల్పా శెట్టి – రాజ్‌ కుంద్ర దంపతులపై చీటింగ్‌ కేసు

ముంబయి : బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రపై చీటింగ్‌ కేసు నమోదుకు ముంబయి కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ దంపతులపై బిట్‌ కాయిన్‌ ఫ్రాడ్‌, మనీలాండరింగ్‌ వంటి కేసులు నమోదయిన సంగతి విదితమే. గత నవంబర్‌ 2022లో పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్ర జైలు శిక్ష అనుభవించారు. తాజాగా … గోల్డ్‌ స్కీమ్‌ (బోగస్‌ బంగారం పథకం)తో శిల్పా రాజ్‌ కుంద్ర తమను మోసం చేశారంటూ ఓ వ్యాపారవేత్త కోర్టును ఆశ్రయించారు. వారు స్థాపించిన సత్‌యుగ్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా తాను మోసపోయాయని, శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని సదరు వ్యాపారి కోరారు. శిల్పాశెట్టి-కుంద్రా దంపతులు, వారు స్థాపించిన సత్‌యుగ్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు జడ్జి ధ్రువీకరించారు. వ్యాపారి చేసిన ఫిర్యాదుపై స్పందించిన ముంబయి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా.. శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జడ్జి పేర్కొన్నారు.

➡️