గుజరాత్‌లో దళిత మహిళ దారుణహత్య

Nov 29,2023 10:20 #Dalit woman, #Gujarat

 

అహ్మదాబాద్‌ : అది మూడు సంవత్సరాల నుండి నడుస్తున్న కేసు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైంది. కేసు పెట్టింది ఓ దళిత యువకుడు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ అప్పటి నుండీ నిందితులు అతని కుటుంబాన్ని వేధిస్తున్నారు. అయితే వారు కేసును ఉపసంహరించుకోలేదు. దీంతో ఆగ్రహించిన దుండుగులు అతని తల్లిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. శైలేష్‌ కోలీ, రోహల్‌ కోలీ, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కలిసి 45 సంవత్సరాల మహిళ గీతాబెన్‌ మారూపై స్టీలు పైపులతో దాడి చేశారు. బిజెపి ఏలుబడిలోని గుజరాత్‌లోని భావనగర్‌లో ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన మారు సోమవారం చనిపోయారు. నలుగురు నిందితుల పైన హత్య, దాడి, భయపెట్టడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ ఆర్‌ఆర్‌.సింఘాల్‌ తెలిపారు. ఆస్పత్రిలో మారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని చెప్పారు. మహిళ మృతి నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు, దళిత నేతలు భావనగర్‌లోని సర్‌ తక్కాసింగ్‌జీ ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. నిందితులను అరెస్ట్‌ చేసే వరకూ మృతదేహాన్ని తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం దుండగుల దాడిలో మారు శరీరంపై పలు గాయాలు ఉన్నాయి. అనేక చోట్ల ఎముకలు విరిగాయి. మారు భర్తను, కుమార్తెను కూడా నిందితులు బెదిరించడంతో వారు భయంతో పారిపోయారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిగేష్‌ మేవానీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో స్పందించారు. అందులో ఆయన కేసు పూర్వాపరాలను వివరించారు. ‘కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో గౌతమ్‌ మారు అనే యువకుడిపై సంఘ వ్యతిరేక శక్తులు దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఎలాగైనా తమకు శిక్ష తప్పదన్న భయంతో నిందితులు గౌతమ్‌ కుటుంబంపై ఒత్తిడి పెంచారు. కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే అందుకు ఆ కుటుంబం నిరాకరించింది. కోర్టులో న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేసింది. దీంతో నిందితులు గౌతమ్‌ తల్లి గీతాబెన్‌పై దాడి చేశారు. ఆమెను భావనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడ చనిపోయారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే ఈ దాడి జరిగింది. రాష్ట్రంలో పోకిరీలు రెచ్చిపోతున్న తీరును ఈ ఘటన ఎండగట్టింది. సంఘ వ్యతిరేక శక్తులు ఇలా ఎలా పెట్రేగిపోతున్నారు? వారికి అంత ధైర్యం ఎలా వచ్చింది? దళితులు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురవుతున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి మాదిరిగానే మూర్ఘంగా చూస్తూ ఉండిపోతోంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️