ప్రజా సమస్యలపై సవివరమైన చర్చ

  • అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్‌
  • నిర్మాణాత్మక చర్చకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి ప్రహ్లాద్‌ జోషి
  • రేపటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు
  • పార్లమెంట్‌ ముందుకు 21 బిల్లులు..అందులో రెండు ఆర్థిక బిల్లులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో సవివరమైన చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత, రేపటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు సాగనున్న ఈ సెషన్‌ లో 15 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. ఈ సెషన్‌ లో మొత్తం 21 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అందులో రెండు ఫైనాన్షియల్‌ బిజినెస్‌కు సంబంధించిన బిల్లులను తీసుకురానుంది. ఈ నేపథ్యంలో శనివారం పార్లమెంట్‌ లైబ్రరీ భవన్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి 23 పార్టీల నుంచి 30 మంది నేతలు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష నేతలతో కేంద్రం చర్చించింది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే బిల్లుల వివరాలు అఖిలపక్ష నేతలకు కేంద్రం అందించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, బిజెపియేతర రాష్ట్రాల పట్ల ఆర్థిక వివక్షపై సవివరంగా చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయి.. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌కి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు హిందీలో పేర్లు పెట్టడంపై అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఐపిసికి బదులుగా భారతీయ న్యాయ సంహిత, సిఆర్‌పిసికి బదులుగా భారతీయ సివిల్‌ ప్రొటెక్షన్‌ కోడ్‌, ఎవిడెన్స్‌ యాక్ట్‌కు బదులుగా భారతీయ సాక్ష్యా అధినియం అని పేరు పెట్టారు. ఈ చర్యను దక్షిణ భారతదేశంలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సాధారణంగా బిజెపి అనుకూల వైఖరిని అవలంబించే అన్నాడిఎంకె కూడా నిరసనలో భాగస్వామ్యం అయింది. కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ ఈ సమావేశంలో పాల్గొనగా, కాంగ్రెస్‌ తరపున జైరాం రమేష్‌, ప్రమోద్‌ తివారీ, గౌరవ్‌ గొగోరు, టిఎంసి నుంచి సుదీప్‌ బంద్యోపాధ్యాయ, డెరెక్‌ ఓ’బ్రియన్‌, డిఎంకె ఎంపి విల్సన్‌, జెఎంఎం నుంచి మహువా మజీ, ఎస్పి నుంచి ఎస్‌టి హసన్‌, బిఎస్పీ ఎంపి గిరీష్‌ చంద్ర, జెడియు నేత దిలేశ్వర్‌ కామత్‌, ఎన్సీపీ ఎంపి ఫౌజియా ఖాన్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపి ఎన్‌ డి గుప్తా, సిపిఎం ఎంపి ఎలమరం కరీం, సంతోష్‌ కుమార్‌ (సిపిఐ), అగాథా సంగ్మా (ఎన్పిపి), ఎన్‌ కె ప్రేమచంద్రన్‌ (ఆర్‌ఎస్పి), నామా నాగేశ్వరరావు (బిఆర్‌ఎస్‌), కనకమేడల రవీంద్ర కుమార్‌ (టిడిపి) తదితరులు హాజరయ్యారు.

  • సభ ముందుకు 21 బిల్లులు

ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. అందులో 19 సాధారణ బిల్లులు కాగా, రెండు ఆర్ధిక బిల్లులు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023, భారతీయ నాAkilapakshamగరిక్‌ సురక్ష సంహితా బిల్లు 2023, భారతీయ సాక్ష్యా బిల్లు 2023 బిల్లు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, మహిళా రిజర్వేషన్‌ చట్టంలోని నిబంధనలను జమ్మూ కాశ్మీర్‌, పుదుచ్చేరికి విస్తరించడానికి రెండు, సెంట్రల్‌ యూనివర్శిటీ సవరణ బిల్లు, పోస్టాఫీసు సవరణ బిల్లు, రాజ్యసభలో ఆమోదం పొందిన అడ్వకేట్స్‌ (సవరణ) బిల్లు, ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పిరియాడికల్స్‌ బిల్లులను జాబితా చేసింది. జమ్మూకాశ్మీర్‌ కు సంబంధించిన నాలుగు బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ఇందులో జమ్మూ కాశ్మీర్‌ రిజర్వేషన్‌(సవరణ) బిల్లు, జమ్మూ కాశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూకాశ్మీర్‌ ఎస్సీ, ఎస్టీ ఆర్డర్‌ సవరణ బిల్లులు ఉన్నాయి. ప్రొవిజినల్‌ కలెక్షన్‌ ఆఫ్‌ టాక్సెస్‌, నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ లా (స్పెషల్‌ ప్రొవిజన్స్‌) రెండో సవరణ బిల్లు వంటివి ఉన్నాయి. అలాగే 2023-24 కి సంబంధించిన డిమాండ్స్‌ గ్రాంట్స్‌, 2020-21 డిమాండ్స్‌ ఫర్‌ ఎక్సెస్‌ గ్రాంట్స్‌ వంటి ఫైనాన్షియల్‌ బిజినెస్‌ పై చర్చ చేపట్టనున్నారు.

➡️