విభేదాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలి : కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

  • రాహుల్‌ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితబోధ చేశారు. రాబోయే మూడు నెలల పాటు పార్టీని గెలిపించడానికి కట్టుబడి ఉండాలని సూచించారు. మీడియాలో అంతర్గత సమస్యలను లేవనెత్తడం మానుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గురువారం నాడిక్కడ ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్‌, పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నేతలతో సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమి పొత్తులు, భారత్‌ జోడో న్యాయ యాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ”పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తేనే లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలుగుతాము” అని అన్నారు. ‘గత పదేళ్లలో తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బిజెపి భావోద్వేగ సమస్యలను తెరపైకి తెస్తోంది. వారు ఉద్దేశపూర్వకంగానే ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ను లాగుతున్నారు’ అని విమర్శించారు. ‘ఆధునిక భారతదేశ నిర్మాణానికి కాంగ్రెస్‌ చేస్తున్న సహకారాన్ని విస్మరించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. మేము వారికి తగిన సమాధానం ఇస్తాం” అని ఖర్గే అన్నారు.

14 నుంచి భారత్‌ జోడో న్యాయ యాత్ర

రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జనవరి 14 నుంచి భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రారంభంకానుంది. మణిపూర్‌ నుండి ముంబాయి వరకు 6,713 కిలో మీటర్ల మేర సాగే ఈ యాత్ర మార్చి 20న ముగుస్తుందన్నారు. మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాల మీదుగా 66 రోజుల పాటు 100 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగనుంది. ఇందులో 337 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కలుస్తాయి.గత ఏడాది కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు 4 వేల కిలోమీటర్ల మేర భారత్‌ జోడో యాత్రను రాహుల్‌ గాంధీ చేపట్టారు. 136 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది. ఇప్పుడు భారత్‌ జోడో న్యారు యాత్ర చేపడుతున్నారు. యాత్ర పేరు ముందు భారత్‌ న్యారు యాత్ర అని ఉండేది. తరువాత దానికి జోడో చేర్చారు. అలాగే ముందుగా 14 రాష్ట్రాల్లో యాత్రను షెడ్యూల్‌ చేయగా, ఇప్పుడు మరో రాష్ట్రాన్ని చేర్చారు. అలాగే, ఈయాత్రలో సామాజిక, ఆర్థిక అంశాలు గురించి రాహుల్‌ గాంధీ లేవనెత్తుతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ తెలిపారు.

➡️