ఇజ్రాయిల్‌కు భారత కార్మికులను పంపొద్దు

Jan 17,2024 10:55 #CITU
  • భారత ప్రభుత్వ చర్యలకు సిఐటియు నిరసన

న్యూఢిల్లీ : పాలస్తీనాపై అత్యంత దారుణమైన రీతిలో మారణహోమాన్ని సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు నిర్మాణ కార్మికులను పంపేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను సిఐటియు తీవ్రంగా నిరసించింది. ఈ విషయంలో వెనక్కి తగ్గి, ఇజ్రాయిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో కేంద్రం, కొన్ని రాష్ట్రాలు పన్నుతున్న వలలో పడవద్దని సిఐటియు కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ఘర్షణలు, యుద్ధంతో అతలాకుతలమవుతున్న దేశం ఇజ్రాయిల్‌ అని, ఒకపక్క గాజాపై ఊచకోతకు పాల్పడుతూనే మరోపక్క ఇజ్రాయిల్‌లో పనిచేస్తున్న వేలాదిమంది పాలస్తీనియన్లను ఉద్యోగాల నుండి తొలగించి, వారిని నిరుద్యోగులుగా మార్చిందని సిఐటియు విమర్శించింది. గాజాపై యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం కూడా అమల్లోకి వచ్చిందని, ఆనాడే సిఐటియు, దాని అనుబంధ సంస్థ సిడబ్ల్యుఎఫ్‌ఐ ఖండించాయని గుర్తు చేసింది. ఇలాంటి ఒప్పందాలు, చర్యలు తీసుకోవడం ద్వారా వేలాదిమంది నిరుద్యోగ భారతీయులను మరణ కుహరంలోకి పంపడమే అవుతుందని సిఐటియు స్పష్టం చేసింది. ఇలా వారికి అవసరమైన కార్మికులను పంపిస్తే, అమానుషమైన రీతిలో యూదు మారణ హోమానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌కు బాసటగా నిలబడే చర్య అవుతుందని, వేలాదిమంది భారతీయుల ప్రాణాలను పణంగా పెట్టినట్లవుతుందని విమర్శించింది. తక్షణమే ఈ అమానుష చర్యకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని కోరింది.

➡️