ఇంటింటికీ ‘పాంచ్‌ న్యాయ్’

  • సిద్ధమైన కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో
  • దేశం మార్పును కోరుకుంటోంది: ఖర్గే

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అట్టడుగు స్థాయి దాకా తీసుకెెళ్లేందుకు రోడ్డు మ్యాప్‌ను రూపొందించామని సిడబ్ల్యుసి సమావేశం అనంతరం ఆ పార్టీ నాయకులు కెసి వేణుగోపాల్‌, జైరాం రమేష్‌ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘పాంచ్‌ న్యాయ్’పై కేంద్రీకరించినట్లు వారు తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటికీ గ్యారంటీ మంత్రంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సిడబ్ల్యుసి పిలుపునిచ్చింది. మంగళవారం నాడిక్కడ జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలపై లోతుగా చర్చించిందని, దీనికి తుది ఆమోదం, మ్యానిఫెస్టో విడుదల తేదీలను ఖరారు చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ సమావేశం అప్పగిస్తూ తీర్మానం చేసింది. రాహుల్‌ గాంధీ ఇటీవల నిర్వహించిన భారత్‌ జోడో న్యారు యాత్రను సిడబ్ల్యుసి కొనియాడింది. ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి బాధలను అర్థం చేసుకోడానికి ఇది తోడ్పడిందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ మ్యానిఫెస్టో సాధారణ పత్రం కాదని, ప్రజల జీవితాలను మార్చే పత్రమని ఆయన అన్నారు. కోట్లాది మందితో మాట్లాడిన తరువాత ‘ఉపాధిలో విప్లవం’ తీసుకొచ్చేందుకు, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఇది రోడ్డు మ్యాప్‌గా ఉంటుందని అన్నారు.
సిడబ్ల్యుసి సమావేశం నిర్ణయాలను ఆ పార్టీ నేతల కెసి వేణుగోపాల్‌, జై రాం రమేష్‌ మంగళవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ, ‘పాంచ్‌ న్యారు’ పేరుతో ఐదు అంశాలపై మొత్తం 25 గ్యారంటీలను కాంగ్రెస్‌ ఇస్తుందన్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సిడబ్ల్యుసి సమావేశానికి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎ.రేవంత్‌ రెడ్డి, సిద్దరామయ్య, సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖ్‌, ఇతర నేతలు కెసి వేణుగోపాల్‌, మీరా కుమారి, అంబికా సోనీ, ప్రియాంక గాంధీ, పి. చిదంబరం, దిగ్విజరు సింగ్‌, వీరప్ప మొయిలీ, అజరు మాకెన్‌, కుమారి సెల్జా, హరీష్‌ రావత్‌, సుబ్బిరామి రెడ్డి, మనీష్‌ తివారీ, సచిన్‌ పైలట్‌, పవన్‌ కుమార్‌ బన్సాలీ, రాజీవ్‌ శుక్లా, జైరాం రమేష్‌ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ దేశం మార్పును కోరుకుంటోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన ‘హామీలు’ 2004 నాటి ‘ఇండియా షైనింగ్‌’ నినాదంతో సమానమని ఎద్దేవా చేశారు. పార్టీ మేనిఫెస్టోలో లేవనెత్తిన ప్రతి అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ సూచించారు.
రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా పాంచ్‌ న్యాయ్ రూపుదిద్దుకుందన్నారు. ‘హిస్సేదారి న్యాయ్’, ‘కిసాన్‌ న్యాయ్’, ‘నారీ న్యాయ్’, ‘శ్రామిక్‌ న్యాయ్’, ‘యువ న్యాయ్’ పేరిట హామీలను ప్రకటించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన , ప్రభుత్వ లేక ప్రైవేట్‌ రంగంలో 25 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హౌల్డర్లు కు అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు, పేపర్‌ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ. లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.

మేనిఫెస్టోలోని 25 గ్యారంటీలు
హిస్సేదారి న్యాయ్
1. సామాజిక, ఆర్థిక కుల గణన
2. ఎస్సి, ఎస్టి, ఒబిసిల రిజర్వేషన్ల కల్పనపై 50శాతం సీలింగ్‌ తొలగింపు
3. ఎస్సి, ఎస్టి సబ్‌ ప్లాన్‌ కోసం ప్రత్యేక బడ్జెట్‌
4. జల్‌ జంగిల్‌ జమీన్‌ పై చట్టబద్ధహక్కులు
5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో గుర్తింపు

కిసాన్‌ న్యాయ్ :
1. స్వామినాథన్‌ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత
2. రుణమాఫీ కమిషన్‌ ఏర్పాటు
3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ
4. రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం
5. వ్యవసాయ పరికరాలపై జిఎస్టి మినహాయింపు

శ్రామిక్‌ న్యాయ్ :
1. వైద్య హక్యు చట్టం
2. రోజుకు రూ.400 కనీస వేతనం. ఉపాధి హామీ పథకంలో సైతం
3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు
4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా యాక్సిడెంట్‌ బీమా
5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల

యువ న్యాయ్:
1. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్‌ షిప్‌ – ఏడాదికి లక్ష రూపాయలు లేదా నెలకు 8500 చెల్లింపు
3. పేపర్‌ లీక్‌ అరికట్టేందుకు కఠినమైన చట్టం
4. గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు
5. యువత స్టార్టప్‌ కోసం ఐదు వేల కోట్లతో నిధి

నారీ న్యాయ్:
1. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
3. ఆశ అంగన్వాడి మిడ్‌ డే మీల్‌ వర్కర్లకు డబుల్‌ శాలరీ కాంట్రిబ్యూషన్‌
4. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు
5. వర్కింగ్‌ విమెన్‌ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్‌

➡️