బ్రిటీష్‌ హయాంలోనే ఓటు హక్కుకై వనిత పిడికిలి

Apr 10,2024 07:22 #2024 elections, #women's, #young voters

పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించాలని ఏళ్లతరబడి మహిళా ఉద్యమ కార్యకర్తలు పోరాటం చేశారు. వారిలో సరోజినీ నాయుడు, ఎస్‌. అంబుజమ్మాళ్‌, అనిబిసెంట్‌, కమలాదేవి చటోపాధ్యాయ, మేరీ పూనెన్‌ లూకోస్‌, బేగం హస్రత్‌ మోహాని, సరళాబాయి నాయక్‌, ధన్వంతి రామారావు, ముత్తులక్ష్మీ రెడ్డి, మంగళమ్మాళ్‌ సదాసివియర్‌, హేరాబాయి టాటా ఉన్నారు. వీరంతా 19వ శతాబ్దంలో మద్రాసులోని అడియార్‌లో ‘వుమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’ అనే సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం ద్వారా మహిళలకు ఓటు హక్కు కల్పించాలని దేశమంతా విస్తృతమైన ప్రచారం చేశారు. వీరి డిమాండ్లను బ్రిటీష్‌ పార్లమెంటు ప్రజాప్రాతినిధ్య చట్టం 1918 ఆమోదించింది. 30 ఏళ్లకు పైబడిన మహిళలకు ఓటు హక్కు కల్పించింది. బ్రిటిష్‌ ప్రభుత్వంలో కేవలం ఓటు హక్కు కోసమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలు పోరాటం చేశారు. మాలతి పట్వర్దన్‌ రాజకీయాల్లో లింగ సమానత్వం కోసం చట్టపరంగా పోరాటం చేశారు. ఆమె బాంబే, మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. సౌత్‌బరో ఫ్రాంచైజ్‌ కమిటీ మోంటాగు చెమ్స్‌ఫోర్డ్‌ సంస్కరణల ప్రకారం ఎన్నికల నిబంధనల్లో మార్పు చేసింది. 1919-1929 మధ్య మహిళల పోరాటానికి జాతిపిత మహాత్మాగాంధీతోపాటు పలువరు స్త్రీవాదులు మద్దతు ఇచ్చారు. ఉద్యమాలు ఊపందుకోవడంతో మహిళలకు శాసనసభ సభ్యురాలిగా ఉండే హక్కును కల్పించే విధంగా ఎన్నికల నియమాలను సవరించడానికి బ్రిటిష్‌ పార్లమెంట్‌ భారత ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. దీంతో మొట్టమొదటిసారిగా ఉద్యమ కార్యకర్త అయిన కమలాదేవి ఛటోపాధ్యాయ 1926లో మద్రాస్‌ ప్రావిన్షియల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి పోటీ చేశారు. ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1927లో జవహరల్‌లాల్‌ నెహ్రూ పురుషులతో సమానంగా స్త్రీలకు ఎలాంటి షరతులు లేకుండా ఓటు హక్కు కల్పించాలని నివేదిక ఇచ్చారు. అలాగే రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లోనూ మహిళల ఓటు హక్కు వయో పరిమితిని తగ్గించాలని డిమాండ్లు ముందుకొచ్చాయి. దీంతో 21 ఏళ్లకు మహిళలకు ఓటు హక్కు కల్పించేలా సవరించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో 10 మంది మహిళలు సాధారణ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు, 41 మంది రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలకు, ఐదుగురు ప్రావిన్షియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లకు నామినేట్‌ అయ్యారు. కోట్లాది మహిళల ఉద్యమాల ఫలితం భారత దేశ స్వాతంత్య్రానంతరం 1950లో పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కును కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగంలోని 60 (1) సవరణ చట్టం 1989 21 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది.

– ఎలక్షన్‌ డెస్క్‌

➡️