కేజ్రీవాల్‌ పిఎ, ఆప్‌ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇడి

  • ఓటుతో సమాధానం చెప్పండి : ఆప్‌ ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పిఎ వైభవ్‌ కుమార్‌, ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌లను ఇడి సోమవారం విచారించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం నిబంధనల కింద కుమార్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. గతంలోనూ ఈ ఇద్దరినీ ఇడి ప్రశ్నించింది. దుర్గేష్‌ పాఠక్‌ సోమవారం ఉదయం ఢిల్లీలోని ఇడి ప్రధాన కార్యాలయంలో ఇడి ముందు హాజరయ్యారు. 2022 సెప్టెంబరులో ఆప్‌ నేత విజరు నాయర్‌ ఇంటిపై ఇడి దాడులు జరిపినప్పుడు దుర్గేష్‌ పాఠక్‌ అక్కడే ఉన్నారు. అప్పుడు పాఠక్‌ ఫోనును ఇడి స్వాధీనం చేసుకుంది.
ఆప్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
ఆప్‌ సరికొత్త థీమ్‌తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేజ్రీవాల్‌ను జైలుకు పంపినందుకు ఓటుతో సమాధానం చెప్పండంటూ ‘జైల్‌ కా జవాబ్‌ ఓట్‌ సే’ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘ఆప్‌’ పోటీ చేస్తున్న నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం సాగిస్తారని ‘ఆప్‌’ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆప్‌ ఎంపి సందీప్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను ఎన్నికలకు దూరంగా ఉంచాలనే ఆలోచనతోనే జైలుకు పంపిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. కేజ్రీవాల్‌ తన యావజ్జీవితం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ ఉత్తమ విద్య, ఆరోగ్యం, విద్యుత్‌, నీరు అందించేందుకు ఎంతో తపన పడుతున్నారని అన్నారు. ‘జైల్‌ కా జవాబ్‌ ఓట్‌ సే’ నినాదంతో ఢిల్లీలోని ఇంటింటికీ వెళ్లి ప్రచారం సాగించనున్నామని చెప్పారు.
కేజ్రీవాల్‌ పిటీషన్‌పై నేడు తీర్పు
మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ఈ తీర్పును ప్రకటించనున్నారు. ఈ వివరాలను ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఢిల్లీ మద్యం విధానం స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్‌ చేస్తూ కేజ్రీవాల్‌ ఈ పిటీషన్‌ వేశారు. తనను ఇడి కస్టడీలో ఉంచడాన్ని, లోక్‌సభ ఎన్నికల సమయంలో తనను అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

➡️