ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌లో రూ.205 కోట్ల ఆస్తులు జప్తుచేసిన ఇడి

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌ విచారణలో భాగంగా రూ.205 కోట్ల విలువైన ఆస్థులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) శుక్రవారం వెల్లడించింది. రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి అనిల్‌ తుతేజాకు చెందిన రూ.15.82 కోట్ల విలువైన 14 ఆస్థులను, అన్వర్‌ దేబార్‌ (రారుపూర్‌ మేయర్‌, కాంగ్రెస్‌ నాయకుడు అయిజాజ్‌ దేబార్‌ సోదరుడు)కు చెందిన రూ.116.16 కోట్లు విలువైన 115 ఆస్థులను, వికాశ్‌ అగర్వాల్‌ అలియాస్‌ సుబ్బుకు చెందిన రూ.1.54 కోట్ల విలువైన ఆస్థులను, అర్వింద్‌ సింగ్‌ కు చెందిన రూ.12.99 కోట్ల విలువైన 33 ఆస్థులను జప్తు చేసుకున్నట్లు ఇడి ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్‌ టెలికాం సర్వీసెస్‌ అధికారి అరుణ్‌పతి త్రిపాటికి చెందిన రూ.1.35 కోట్ల విలువైన ఒక ఆస్థిని, మద్యం వ్యాపారికి చెందిన రూ.28.13 కోట్లు విలువైన తొమ్మిది ఆస్థులను, నవీన్‌ కెడియాకు చెందిన రూ.27.96 కోట్లు విలువైన అభరణాలను కూడా జప్తు చేసుకున్నట్లు ఇడి తెలిపింది. ఆశీష్‌ సౌరభ్‌కు చెందిన రూ.1.2 కోట్లు ఆస్థులను కూడా ఇడి జప్తు చేసుకుంది. మొత్తంగా రూ. 205.49 కోట్లు విలువైన 18 చరాస్థులను, 161 స్థిరాస్థులను ఇడి జప్తు చేసుకుంది. 2003 బ్యాచ్‌ అనిల్‌ తుతేజాను ఈ కేసులో ఇడి ఇటీవలే అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మద్యం సిండికేట్‌ను తుతేజా నిర్వహించేవాడని ఆరోపించింది. తుతేజా చర్యల కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, మరోవైపు మద్యం సిండికేట్‌ వ్యాపారుల మాత్రం రూ. 2,161 కోట్ల నగదును ఆర్జించారని ఇడి ఆరోపించింది. ఈ కేసులో ఇడి గతంలో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేయడంతో, ఇడి తాజాగా మరో మనీలాండరింగ్‌ కేసును నమోదు చేసింది.

➡️