Mahua Moitra : టిఎంసి నేతకు ఇడి నోటీసులు

Mar 27,2024 16:48 #ED summons, #FEMA case, #Mahua Moitra

కోల్‌కతా :    టిఎంసి నేత మహువా మొయిత్రాకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి ) బుధవారం సమన్లు జారీ చేసింది. వ్యాపార వేత్త దర్శన్‌ హీరానందానీకి కూడా నోటీసులిచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్‌ఇఎంఎ) కింద గురువారం విచారించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఇ) కింద ఒకదేశం లోని ఖాతా నుండి మరో దేశంలోని ఖాతాకు నగదు చెల్లింపులు (ఫారిన్‌ రెమిటన్స్‌) జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

విచారణకు హాజరుకావాల్సిందిగా మహువాకు ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలపై శనివారం సిబిఐ ఆమె నివాసంలో సోదాలు జరిపింది. అవినీతి నిరోధక శాఖ లోక్‌పాల్‌ ఆమెపై బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఫెడరల్‌ ఏజన్సీని ఆదేశించిన మరుసటి రోజు సిబిఐ ఆమె నివాసంలో సోదాలు చేపట్టడం గమనార్హం.

‘అనైతిక ప్రవర్తన’ ఆరోపణలతో గతేడాది డిసెంబర్‌లో లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన మహువాను టిఎంసి మరోసారి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుండి ఆమె ఎన్నికల బరిలోకి దిగారు.

➡️