ECI: హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ : హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను మార్పులు, చేర్పులతో సవరించడం ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. హర్యానా (నవంబరు 3), మహారాష్ట్ర (నవంబరు 26), జార్ఖండ్‌ (జనవరి 5, 2025) రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ముగుస్తుండడంతో ఇసి రంగంలోకి దిగింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇసి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంతో పాల్గన్నారు. అందువల్లే జులై 1 నాటికి నమోదు చేసుకున్న వారితో ఓటర్ల జాబితాను ఆధునీకరించాలని కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినట్లు ఆ ప్రకటన పేర్కొంది. సెప్టెంబరు 30కల్లా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గత డిసెంబరులో సుప్రీం కోర్టు ఇసిని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు గురువారం ప్రధాని మోడీ ప్రకటించారు. ఇవి, 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కానున్నాయి. ఆగస్టు 20న తుది ఓటర్ల జాబితాలను ప్రచురిస్తారు. ఓటర్ల జాబితా ఆధునీకరణకు ముందు చేపట్టే కార్యకలాపాలు అంటే పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం లేదా హేతుబద్ధం చేయడం వంటి చర్యలు జూన్‌ 25 నుండి ప్రారంభం కానున్నాయి.

➡️