లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌పై మనీలాండరింగ్ కేసులో ఈడి సోదాలు 

  న్యూఢిల్లీ :    లారెన్స్‌ బిష్ణోయ్  గ్యాంగ్‌పై మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) మంగళవారం ఉదయం సోదాలు చేపట్టింది. హర్యానా, రాజస్థాన్‌లలో పలుమార్లు సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతోందని, రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది.  లారెన్స్‌ బిష్ణోయ్ , అతని సహాయకుడు సత్వీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), హర్యానా, ఇతర రాష్ట్రాల పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మరియు చార్జిషీటుల ఆధారంగా ఈడి ఈ చర్యలు చేపడుతోంది.

ప్రముఖ పంజాబీ  గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో బిష్ణోయ్  ఒకరు. ప్రస్తుతం ఆయన జైలులో  ఉన్నారు. డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా, దోపిడీ ద్వారా సేకరించిన నగదును బిష్ణోయ్  గ్యాంగ్‌ భారత్‌ నుండి కెనడాతో పాటు ఇతర దేశాలకు పంపుతోందన్న కేసు విచారణలో భాగంగా ఈడి సోదాలు చేపడుతోంది. ఈ నగదును ఖలీస్థానీ మద్దతుదారులకు అందిస్తున్నట్లు ఎన్‌ఐఎ తన ఫిర్యాదులో పేర్కొంది.

➡️