రాజ్‌భవన్‌లోకి ప్రవేశం నిషేధం!

  • పోలీసులు, ఆర్థిక సహాయ మంత్రి రాకుండా బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశాలు

కోల్‌కత్తా : రాష్ట్రంలో ఉన్న రాజ్‌భవన్‌లోకి పోలీసులు, రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రవేశించకుండా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సివి ఆనంద బోస్‌ నిషేధం విధించారు. ఈ మేరకు రాజభవన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌పై పరువునష్టం, రాజ్యంగ వ్యతిరేక ప్రకటనలు చేసినందుకు కోల్‌కతా, డార్జిలింగ్‌, బరాక్‌పూర్‌లోని రాజ్‌భవన్‌ల ప్రారగణంలోకి ప్రవేశించకుండా నిషేధించడమైనదని ఉత్తర్వులో పేర్కొంది. మంత్రి పాల్గొనే ఏ కార్యక్రమంలో కూడా గవర్నర్‌ పాల్గొనరని కూడా ఉత్తర్వు పేర్కొంది. మంత్రికి వ్యతిరేకంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు భారత అటార్నీ జనరల్‌ను సలహా కోసం గవర్నర్‌ సంప్రదించినట్లు కూడా ఉత్తర్వు తెలిపింది. మరొక ఉత్తర్వులో ‘ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను శాంతింపజేసేందుకు అనధికార, చట్టవిరుద్ధమైన, బూటకపు, ప్రేరేపిత ‘విచారణ’ చేసే ముసుగులో రాజ్‌భవన్‌ ఆవరణలోకి ప్రవేశించకుండా పోలీసులపై కూడా గవర్నర్‌ నిషేధం విధించారు’ అని పేర్కొన్నారు.

➡️