మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి

Jan 5,2024 11:03 #First woman DGP, #Maharashtra
  • వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి

ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో పదవీ విరమణ చేసిన రజనీష్‌ సేథ్‌ స్థానంలో కొత్త పోలీస్‌ బాస్‌గా రష్మీ శుక్లాను నియమిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా రష్మి శుక్లాను రికార్డులకెక్కారు. ప్రస్తుతం సరిహద్దు రక్షణ దళం సశాస్త్ర సీమా బాల్‌ (ఎస్‌ఎస్‌బి) అధిపతిగా కేంద్రం డిప్యూటేషన్‌లో శుక్లా వున్నారు. కాగా, మహారాష్ట్రంలో తొలి మహిళా డిజిపిగా నియమించబడిన శుక్లాపై అనేక వివాదాలు ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర రాష్ట్ర నిఘా విభాగం (ఎస్‌ఐడి) కమిషనర్‌గా ఉన్న సమయంలో అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సన్నిహితంగా ఉన్నారని, శివసేన, కాంగ్రెస్‌లకు చెందిన నాయకులు ఫోన్లను రహస్యంగా ట్యాప్‌ చేశారని శుక్లాపై ఆరోపణలు ఉన్నాయి. తరువాత మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎస్‌ఐడి నుంచి సమాచారాన్ని ఫడ్నవీస్‌కు లీక్‌ చేశారని కూడా శుక్లాపై అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో శుక్లా మూడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. దీంతో శుక్లాను సివిల్‌ ఢిఫన్స్‌కు మహాకూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచీ కూడా శుక్లా మళ్లీ రాష్ట్రానికి తిరిగివస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అవే నిజయ్యాయి. అలాగే శుక్లా ఈ జూన్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆమె పదవీ కాలాన్ని ప్రస్తుత ప్రభుత్వం పొడిగిస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి

➡️