అనంతనాగ్‌ నుంచి గులాం నబీ అజాద్‌ పోటీ

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్‌ అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని 2022లో ఆయన డెమొక్రటిక్‌ ప్రోగ్రేసివ్‌ అజాద్‌ పార్టీ (డిపిఎపి) నెలకొల్పిన సంగతి విదితమే. అనంత్‌నాగ్‌ నుంచి అజాద్‌ పోటీ చేయాలని పార్టీ కీలక నేతల సమావేశంలో నిర్ణయించినట్లు డిపిఎపి నేత తాజ్‌ మొహివుద్దీన్‌ తెలిపారు. 2014లో ఉధంపుర్‌ – దోదా స్థానంలో బిజెపి నేత జితేంద్ర సింగ్‌ చేతిలో ఓడిపోయిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో అజాద్‌ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ స్థానంలో ఇప్పటి వరకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఒక్కటే తన అభ్యర్థిగా మియాన్‌ అల్తాఫ్‌ను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. గుజ్జర్‌ సామాజిక తరగతిలో ఆయనకు విశేషమైన ప్రాచుర్యం ఉంది. బిజెపి కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా ఈ స్థానాన్ని పహారీలకు రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) మెహాబూబా ముఫ్తీ ఇదివరకు ఈ స్థానంలో విజయం సాధించారు. అందువల్ల పిడిపి ఈ స్థానాన్ని తన కంచుకోటగా భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు పిడిపి తన అభ్యర్థిని ప్రకటించలేదు. ‘ఇండియా’ బ్లాక్‌ ఎన్‌సి, పిడిపితో సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు చేస్తున్నందున కాంగ్రెస్‌ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు.

➡️