ప్రత్యేక హోదా ఇవ్వండి – ఎపి భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యాన ఎపి భవన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిలా మాట్లాడుతూ ”పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోలేదన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాజధాని నిర్మాణానికి సహకారం, కడప స్టీల్‌ ప్లాంట్‌ హామీ అమలుకు నోచుకోలేదు. దుగరాజపట్నం పోర్ట్‌ను నిర్లక్ష్యం చేశారు. విశాఖ రైల్వే జోన్‌ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. బుందేల్‌ఖండ్‌ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. వైజాగ్‌ – చెన్నై కారిడార్‌ను ఏర్పాటు చేయలేదు. ఎపిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హామీలు అమలు చేయనప్పుడు బిజెపికి ఎందుకు ఏపిలో పార్టీలు మద్దతునిస్తున్నాయి. తమ పోరాటం ఇకముందు కూడా కొనసాగుతుంది. అన్ని పార్టీల నేతలను కలవడంతోపాటు అందరికీ లేఖలు రాస్తాం. కేంద్రప్రభుత్వం చట్టాన్ని గౌరవించి విభజన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. తొలుత కాంగ్రెస్‌ కార్యకర్తలు బ్యానర్లు కట్టడంతో అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఆ తరువాత కాంగ్రెస్‌ నాయకులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

➡️