జార్ఖండ్‌లో బిజెపికి ఎదురుగాలి

Apr 24,2024 00:38 #jarkhand

ఎలక్షన్‌ డెస్క్‌ :అక్రమ కేసులు బనాయించి ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చడం, కీలక నాయకులను ఇబ్బంది పెడుతోంది కేంద్ర బిజెపి. మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు తొలుత బలైంది జెఎంఎం అగ్రనేత, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌. బిజెపి ఎంచుకున్న అక్రమ పద్ధతులు ఈ లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో జెఎంఎంకు అనుకూలంగా మారాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ సిఎం సోరెన్‌పై ప్రజల్లో సానుభూతి, బిజెపిలో అంతర్గతంగా ముఠా తగాదాలు వెరశి జార్ఖండ్‌లో బిజెపికి ఎదురుగాలి వీస్తోంది.

జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటికి నాలుగు, ఐదు, ఆరవ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిత్రపక్షంతో కలిసి బిజెపి 13 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎజెఎస్‌యు ఒక స్థానంలో పోటీ చేస్తోంది. మరోవైపు ఇండియా బ్లాక్‌ పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కుదిరాయి. జెఎంఎం 5, కాంగ్రెస్‌ 2, సిపిఎం, ఆర్‌జెడి చెరొక స్థానంలో పోటీ చేస్తున్నాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వినోద్‌కుమార్‌ సింగ్‌ సిపిఎం తరపున పోటీ చేస్తున్నారు.
గతంలో వచ్చినన్ని సీట్లు బిజెపికి అసాధ్యం
2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 11 సీట్లు, కాంగ్రెస్‌ 1, జెఎంఎం 1, ఎజెఎస్‌యు 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో జెఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జెడి కూటమికి 47 స్థానాలు లభించాయి. హేమంత్‌ సోరెన్‌ను మనీలాండరింగ్‌ కేసు నమోదు అయిన వెంటనే ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని గవర్నర్‌ రద్దు చేశారు. బిజెపి సోరెన్‌ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినా విశ్వాస పరీక్షలో 48 ఓట్లు సాధించి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై ఇ.డి. భూకుంభకోణం, మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. దాంతో సోరెన్‌ సిఎం పదవికి రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజే ఆయన అరెస్టయ్యారు. జెఎంఎం కూటమి తరుఫున చంపాయి సోరెన్‌ సిఎంగా ప్రమాణం చేశారు. వెంటనే ఆయన బలపరీక్ష నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో బిజెపి నుంచి ఎమ్మేల్యేలను కాపాడుకోవాల్సి వచ్చింది. బిజెపి కుట్రలను ఎదుర్కొని చంపాయి సోరెన్‌ అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గారు.
బిజెపి కుట్రలు
కాగా గిరిజన జనాభా అధికంగా ఉన్న జార్ఖండ్‌లో మతం, తెగల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. ఆదివాసీలను హిందువులుగా చూపాలన్న సంఫ్‌ుపరివార్‌ వైఖరిని జెఎంఎం వ్యతిరేకిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌లో జెఎంఎం ఉంది.
బిజెపికి అది గిట్టనందునే అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతోంది. కాగా హేమంత్‌ సోరెన్‌, ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ అరెస్టులను నిరసిస్తూ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా బ్లాక్‌ నిర్వహించిన ర్యాలీలో సిఎం చంపాయి సోరెన్‌తో పాటు అరెస్టయిన మాజీ సిఎం హేమంత్‌ సోరెన్‌ భార్య పాల్గొన్నారు. ఈ పరిణామం లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. హేమంత్‌ అరెస్ట్‌ అనంతరం ఆదివాసీల్లో జెఎంఎంపై సానుభూతి పెరిగిందని అంచనా వేస్తున్నారు.

➡️